కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకంపై స్పష్టత రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 వానకాలం సీజన్ సాయాన్ని పూర్తిగానూ, అదే ఏడాది యాసంగి సీజన్ సాయాన్ని పాక్షికంగానూ (4 ఎకరాలకు పైబడిన విస్తీర్ణానికి) రేవంత్ సర్కారు ఎగ్గొట్టడంపై భగ్గుమంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల ప్రయోజనం కోసం ఇప్పుడు మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుండడంపై మండిపడుతున్నారు. సీజన్‌కు రూ.7,500 చొప్పున రెండు సీజన్లకు కలిపి ఒక్కో ఎకరానికి రూ.15 వేల రైతు భరసా ఇస్తామంటూ అధికారంలోకొచ్చిన కాంగ్రెస్.. 2024 వానకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలోని సుమారు 3,51,592 మంది రైతులకు రూ.438 కోట్లను ఎగ్గొట్టింది. తరువాత ఆ రైతుభరోసా సాయంపై మాట మార్చింది.
-ఖమ్మం, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా ఎకరానికి రూ.12 వేల చొప్పునే (ఒక్కో సీజన్‌కు రూ.6 వేల లెక్కన) ఇస్తామంటూ మాట తప్పింది. ఆ తరువాత అదే ఏడాది యాసంగి సీజన్లో 4 ఎకరాల్లోపు పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేసింది. అదే సీజన్‌కు సంబంధించి ఇంకా 62,561 మంది రైతులకు రూ.179 కోట్ల పంట సాయాన్ని పెండింగ్ పెట్టింది. తాజాగా మొదలుపెట్టిన రైతుభరోసా నిధుల పంపిణీని 2025-26 వానకాలం సాయంగా ప్రకటించింది. దీంతో 2024 వానకాలం సీజన్‌కు సంబంధించిన రూ.438 కోట్లను, అదే ఏడాది యాసంగికి సంబంధించిన (పెండింగ్) రూ.179 కోట్లను ఎగ్గొట్టినట్లు స్పష్టమైంది.
పరిమితంటూ నాడు నానా యాగీ
పంటల సాయాన్ని మరింత పెంచి ఇస్తామంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు.. తమను నిలువునా మోసం చేయడంపై ఖమ్మం జిల్లా రైతులు మండిపడుతున్నారు. తమ నోటికాడి ముద్దకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధునిస్తూ, అన్నదాతకు ఊతమిస్తూ వ్యవసాయరంగ దిశను మార్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నానా నిందలు మోపింది కాంగ్రెస్ సర్కారు.
అయితే, చెట్లకు, పుట్టలకు, రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, బీళ్లకు, గుట్టలకు రైతుబంధునిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందంటూ నాడు నానా యాగీ చేసిన కాంగ్రెస్.. తాము అధికారంలోకి వస్తే సాగుకు యోగ్యమైన భూములకే రైతుభరోసాను ఇస్తామని, పరిమితి మేరకు పంటల సాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన కొత్తలో సాగుకు యోగ్యమైన భూములను గుర్తించేందుకు ఏఈవోలతో బలవంతంగా సర్వేలు చేయించింది. రియల్ ఎస్టేట్ వెంచర్లున్నాయని, సాగుచేయని బీళ్లున్నాయని కొన్నింటిని గుర్తించినట్లు ప్రకటించింది.
ఆయా భూములకు రైతుభరోసాను నిలిపి వేసింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి.. ఎన్ని ఎకరాల వరకూ రైతుభరోసా ఇవ్వొచ్చో చెప్పాలంటూ రైతుల అభిప్రాయాలనూ స్వీకరించింది. ఐదెకరాల్లోపు ఇవ్వాలని కొందరన్నారని, పదెకరాల్లోపు ఇవ్వాలని మరికొందరన్నారని చెప్పింది. ఆ మేరకు పరిమితులు విధిస్తామని, ఆపైన ఉన్న విస్తీర్ణానికి రైతుభరోసా ఇవ్వబోమని ప్రకటనలు చేసింది. కానీ.. తాజాగా ఈ విషయాలపైనా మాట మార్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం రైతుభరోసా విషయాల్లో మాట తప్పింది.
గతంలో పరిమితులంటూ పలికిన పలుకులను ఇప్పుడు పక్కన పెట్టింది. రైతులు ఎన్ని ఎకరాలు సాగుచేస్తే అన్ని ఎకరాలకూ రైతుభరోసానిస్తామని, పరిమితులేమీ లేవని ఈ నెల 16న హైదరాబాద్‌లో జరిగిన ‘రైతు నేస్తం’ ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి స్పష్టం చేశారు. దీంతో రైతులకు దిమ్మదిరిగినంత పనైంది. దీనికితోడు గడిచిన అన్ని సీజన్లలోనూ సాగు పనుల ప్రారంభానికి ముందుగానీ, వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాకగానీ రైతుభరోసాను జమ చేయని సర్కారు.. తాజాగా మరో స్వార్థపు బుద్ధిని బయటపెట్టుకుంది.
గత యాసంగికి సంబంధించి నాలుగు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఇస్తామన్న రైతుభరోసాని.. తాజా వానకాలం సీజన్ వరకూ కొద్దికొద్దిగా, విడతలు విడతలుగా జమ చేస్తూ ఆరు నెలలు సాగదీసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ వానకాలం సాయాన్ని మాత్రం జూన్ అర్ధభాగంలోనే, అది కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే, అది కూడా ఎకరాల పరిమితులు లేకుండానే జమ చేస్తుండడాన్ని జిల్లా రైతులు నిశితంగా గమనించారు. 9 రోజుల్లో తమకు రైతుబంధును జమ చేసి, ఆ వెంటనే తమతో ఓట్లు వేయించుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకుంటున్న కపటాన్ని గుర్తించారు.
నాట్లు వేసే నాటికి రైతుభరోసాను ఇస్తామంటూ పక్షం రోజుల కింద మంత్రి తుమ్మల పలికిన పలుకులను, అలాగే.. ఓట్ల కోసం నాట్లకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ జమ చేస్తూ రేవంత్ పలుకుతున్న పలుకులను పరిశీలిస్తున్న జిల్లా రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితులు లేకుండా పట్టాబుక్కులున్న భూములకు రైతుబంధును ఇవ్వడాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్.. నేడు ఓట్ల కోసం పరిమితులు లేవంటూ స్పష్టం చేయడాన్ని గమనించిన జిల్లా రైతులు..
‘తాను చేస్తే వ్యభిచారం.. మరొకరు చేస్తే..’ అనే సామెతను గుర్తుచేసుకుంటుండడం గమనార్హం. ఎకరాల విస్తీర్ణానికి పరిమితి విధిస్తే ఎన్నికల్లో నష్టపోతామన్న భయంతోనే రైతుభరోసాను అన్ని ఎకరాలకూ వర్తింపజేస్తున్నారంటూ తేల్చిచెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, కాంగ్రెస్ సర్కారుకు అలవాటు లేని విధంగా జూన్ అర్ధభాగంలో, అందునా కేవలం తొమ్మిది రోజుల కాలంలో పంటల సాయాన్ని పంపిణీ చేస్తుండడమే కాంగ్రెస్ దుర్బుద్ధికి సంకేతమని స్పష్టం చేస్తున్నారు.
ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా..
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వానకాలం సీజన్‌కు పెట్టుబడి సాయాన్ని నా ఖాతాలో జమ చేసింది. నాకు 1.36 ఎకరాల పొలం ఉంది. ఇందుకుగాను రూ.11,400 యాసంగి సాయం నా ఖాతాలో జమ అయింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో సీజన్‌కు ముందుగానే పెట్టుబడి సాయం అందించేవారు. కాంగ్రెస్ వచ్చాక ఆ గ్యారెంటీ లేకుండా పోయింది. నాడు కేసీఆర్ నాట్లకు, నాట్లకు మధ్య రైతుబంధును ఇచ్చేవారు. ఇప్పుడు ఓట్ల కోసం రేవంత్ ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసాను ఇస్తున్నారు.
-పోతురాజు సంగయ్య, రైతు, చిమ్మపూడి
యాసంగి సాయం ఎగ్గొట్టింది..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు భరోసా సాయం జమ అవుతుందనే నమ్మకం పోయింది. గత యాసంగి సీజన్ సాయాన్నీ ఎగ్గొట్టింది. ఇప్పుడు ఈ వానకాలం సీజన్ సాయాన్ని మాత్రమే ఇస్తోంది. మాట తప్పడంలో ఎప్పుడూ ముందుండే కాంగ్రెస్, రైతుభరోసాను ఇవ్వడంలో ఎప్పుడూ వెనకుండే కాంగ్రెస్.. ఇప్పుడు ఈ వానకాలం సాయాన్ని జూన్‌లోనే ఇస్తోందంటే ఏదో పెద్ద ప్లానే ఉంది. ఎన్నికల కోసమే అయితే కాంగ్రెస్ నేతలను ఊళ్లోకి రానివ్వం.
-షేక్ మీరా, రైతు, చిమ్మపూడి