ఏన్కూరు: వాణిజ్య పంటలు వేసి తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీతో ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కూరగాయల పంటలకు డ్రిప్ ఇరిగేషన్, పందిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. వీటితో పాటు కరివేపాకు, బొప్పాయి, పామ్ఆయిల్, సుబాబుల్ పంటలకు కూడా రాయితీ అందిస్తుంది. దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడానికి రైతులు వ్యాపారేతర పంటల్ని సాగు చేస్తున్నారు.
ఏన్కూరు మండలంలోని హిమామ్నగర్, రేపల్లెవాడ, గార్లఒడ్డు, తూతకలింగన్నపేట, నాచారం గ్రామాల్లో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటల్ని సాగు చేస్తున్నారు. కూరగాయ పంటలతో పాటు, కరివేపాకు, బొప్పాయి, పామాయిల్, సుబాబుల్ సాగు చేస్తూ రైతులు అధిక లాభాల్ని పొందుతున్నారు. ఉద్యానవనశాఖ అధికారులు ఈ పంటలపై రైతులకు అవగాహన కల్పించడంతో వీటి సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.