యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ‘యూరియా ఇవ్వండి మహాప్రభో..’ అంటూ పాలకులను వేడుకుంటున్నారు. అయినా, వారు కనికరించడం లేదు. కళ్లు తెరవడం లేదు. యూరియా కొరత నివారణకు కనీస చర్యలు తీసుకోవడం లేదు. అన్నదాతల అవసరాలకు తగిన యూరియాను తెచ్చి పంపిణీ చేయడమూ లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో ఎంతో సహనంతో తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాలకు వద్దకు పరుగులు పెడుతున్నారు. భారీ క్యూ లైన్లలోనూ గంటల తరబడి నిలబడి నిరీక్షిస్తున్నారు. అదృష్టం బాగుండి బస్తా దొరికితే ‘అదే పది వేలు’ అనుకుంటున్నారు.
అది కూడా దొరకకపోతే నిరాశతో ఇంటిబాట పడుతున్నారు. వ్యవసాయ పనులు మానుకొని మరీ వేకువజామునే సొసైటీ గోదాములకు వెళ్లినా యూరియా బస్తాలు దొరుకుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. మహిళా రైతులైతే తమ చంటి పిల్లలను కూడా చంకనబెట్టుకొని మరీ కిటకిటలాడుతున్న క్యూ లైన్లలో నిలబడాల్సిన దయనీయ స్థితి నెలకొంది. వేల సంఖ్యలో తరలివచ్చిన రైతులకు ఉన్న కొద్దిపాటి యూరియా బస్తాలను పంపిణీ చేయలేక సొసైటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. పదుల ఎకరాల్లో పంటలు వేసిన రైతుకైనా ఒకే ఒక్క యూరియా బస్తా ఇస్తుండడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. దాదాపుగా అన్ని సొసైటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరికి కర్షకులకు ఎరువులు పంపిణీ చేసేందుకు పోలీసు పహారా పెట్టాల్సిన దైన్యం నెలకొంది. ఆయా సొసైటీల వద్ద బుధవారం కూడా రైతులు భారీ క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు కాశారు.
చండ్రుగొండ, సెప్టెంబర్ 3: చండ్రుగొండ మండలం గానుగపాడు సహకార సంఘం (సొసైటీ) కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్న ఇదే మండలంలో మరోవైపు యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. యూరియా బస్తాల కోసం బుధవారం తెల్లవారుజాము నుంచే గానుగపాడు సొసైటీ వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎంతసేపటికీ సొసైటీ అధికారులు యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులకు ఓపిక నశించింది. దీంతో సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమకు సరిపడా యూరియాను ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘యూరియా కోసం రోజూ సొసైటీల చుట్టూ తిరగాల్నా? లేక వ్యవసాయం మానివేయాలా?’ అంటూ ప్రశ్నించారు. కాగా, రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సత్తి నాగేశ్వరరావు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.
యూరియా కోసం సొసైటీ చుట్టూ రోజులతరబడి తిరుగుతున్నా. సొసైటీలో యూరి యా దొరకకపోవడంతో బయట వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అదును దాటిన తర్వాత పంటలకు యూరియా వేసినా దండగే. వరి, పత్తి పంటలు వేసి చాలా రోజులైంది. ఇప్పుడు యూరి యా వేయకపోవడం వల్ల దిగుబడులపై ప్రభావం పడుతుంది. వెంటనే యూరియా అందించాలి.
నేను నాలుగెకరాల్లో పం టలు సాగు చేస్తున్నా. చాలా రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నా. ఇప్పుడు యూరియా వేయకపోతే నష్టం వచ్చే పరిస్థితి ఉంది. బయట యూరియా కట్ట రూ.400 చొప్పున అమ్ముతున్నారు. అయినా దొరకట్లేదు. ఈరోజు యూరియా కోసం వెళితే రేపు రమ్మని చెబుతున్నారు. ప్రభుత్వం రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయాలి.
నేను ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఈ ప్రభుత్వంలో యూరియా కోసం పడ్డ ఇబ్బందులు ఎప్పుడూ పడలేదు. వర్షంలోనూ యూరియా కోసం తిరుగుతున్నా. బయట మార్కెట్లో కూడా యూరియా దొరకట్లేదు. ప్రభుత్వమే సకాలంలో యూరియా పంపిణీ చేస్తే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరఫరాను వేగవంతం చేయాలి.
యూరియా కోసం తెల్లవారుజాము నుంచి క్యూలో చంటి బిడ్డతో నానా అగచాట్లు పడుతున్నా. ఒక్క కట్ట అయినా అందుతుందో.. అందదో చెప్పలేని పరిస్థితి. ఐదు రోజులుగా సొసైటీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా. ప్రభుత్వం, అధికారులు రైతుల బాధలు పట్టించుకొని యూరియా కొరత లేకుండా రైతులందరికీ అందేలా చూడాలి.
నాలుగెకరాల్లో వరి, ఆరెకరాల్లో పత్తి సాగు చేశాను. యూరియా కోసం 15 రోజులుగా సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. క్యూలో గంటలకొద్దీ నిలబడినప్పటికీ తనవంతు వచ్చేసరికి యూరియా నిల్వలు అయిపోతున్నాయి. మరో రోజు వచ్చి వేచిచూడాల్సిన పరిస్థితి వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడూ రైతులకు ఇబ్బంది కలగలేదు.
యూరియా కోసం తీర్ధాల, మద్దివారి క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన గోడౌన్ వద్దకు వెళ్లాను. అయితే అప్పటికే యూరియా బస్తాలు వచ్చాయి.. అయిపోయాయి అని సిబ్బంది చెప్పారు. పొలం నాటేసి పదిహేను రోజులు అవుతుంది. యూరియా చల్లకపోతే పంట చేతికొచ్చే అవకాశం లేదు. నా జీవితంలో ఎన్నడూ యూరియా కోసం ఇంత ఇబ్బంది పడలేదు.