చండ్రుగొండ, ఫిబ్రవరి 18 : సీతాయిగూడెంలోని వెంగళరావు ప్రాజెక్టు అలుగు నిర్మాణ పనులకు నాసిరకపు మెటీరియల్‌ను వినియోగిస్తుండడంపై సీతాయిగూడెం, దామరచర్ల ఆయకట్టు గ్రామాల రైతులు బుధవారం ప్రాజెక్టు పనుల వద్ద నిరసన చేపట్టారు. పనులకు వినియోగిస్తున్న నాసిరకపు ఇసుక, కాంక్రీట్‌ను చూపుతూ కాంట్రాక్టర్ గుమస్తాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాత్రివేళల్లో ట్రాక్టర్ల ద్వారా వాగుల నుంచి ఇసుక, రాళ్లను తరలించి పనులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.
పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన పనులను నాణ్యతా లోపంతో నిర్మిస్తుండడంపై మండిపడ్డారు. ప్రాజెక్టు అలుగు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు మంజూరు చేస్తే.. నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై నాసిరకంగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. పనులను కనీసం ఇంజినీరింగ్ స్థాయి పర్యవేక్షించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పనులు నాణ్యతగా చేపట్టని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీతాయిగూడెం సర్పంచ్ పిట్టల రామలక్ష్మయ్య, ఆయకట్టు గ్రామాల రైతులు బొర్రా కేశవులు, మాయర సతీశ్, సంగొండి రాఘవులు, ఆంజనేయులు, చిన్నం గంగరాజు, మల్లయ్య, వాసం నాగేశ్వరరావు, పిట్టల నాగభూషణం, వేముల చిన్న వెంకటేశ్వరరావు, కనకం శ్రీను, బన్నె రాము, బొమ్మకంటి లక్ష్మణ్, జడ శ్రీను, బీరకాయల వెంకటేశ్వర్లు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.