ఇల్లెందు, సెప్టెంబర్ 24: మూడు రోజులుగా తిరుగుతున్నా బస్తా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదునుమీదున్న పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయకపోవడంతో దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని దిగులు పడుతున్నారు. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులోని సొసైటీ గోడౌన్ వద్దకు రైతులు బుధవారం తెల్లవారుజామునే చేరుకొని క్యూలో నిల్చున్నారు.
అయితే ఉదయం 10 గంటలకు వచ్చిన సొసైటీ సిబ్బంది.. యూరియా స్టాక్ లేదని చెప్పారు. దీంతో యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులను ఏవో సతీశ్.. పోలీసుల సహకారంతో నచ్చజెప్పి ఇళ్లకు పంపించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ యూరియా కోసం మూడు రోజులుగా సొసైటీ చుట్టూ తిరుగుతున్నా బస్తా యూరియా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంటలకు సరిపోయే విధంగా యూరియా పంపిణీ చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు.