తిరుమలాయపాలెం, మే 17: దిగుమతి కేంద్రాల వద్ద మొక్కజొన్న వాహనాలు బారులుతీరడంతో రైతన్నలు ఆ పంటలను కాపాడుకునేందుకు అక్కడే రోజులకొద్దీ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆదివారం ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లు వద్ద దిగుమతి కోసం మొక్కజొన్న వాహనాలు వందల సంఖ్యలో బారులుతీరాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను దిగుమతి చేసేందుకు భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో అధికారులు ఏర్పాట్లు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన మొక్కజొన్న బస్తాలను రైతులు ట్రాక్టర్లు, లారీల్లో దిగుమతి కోసం మిల్లు వద్దకు తరలించారు. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల నుంచి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో రెండు కిలోమీటర్ల వరకు బారులుదీరాయి. మొక్కజొన్నలు దిగుమతి కావడానికి రెండు, మూడ్రోజులు పడుతుందని, అప్పటివరకు తమ పంటలను కాపాడుకునేందుకు గోదాముల వద్దనే రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంరూరల్ మండలంలోని ఆరెంపుల, ముత్తగూడెం గోదాముల వద్ద కూడ ఇదే పరిస్థితి నెలకొంది.