కూసుమంచి (నేలకొండపల్లి)/ రఘునాథపాలెం/ వైరా టౌన్, మార్చి 30 : గ్రామీణ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఎకరాకు 20 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని, మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. అలాగే వరి ధాన్యం చేతికొస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అలాగే జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌లో కలెక్టర్ అనుదీప్‌కు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేశ్ వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు జరగడం లేదన్నారు. తక్షణమే జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వైరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌కి వెళ్లి మొక్కజొన్నలను పరిశీలించడంతోపాటు రైతు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వైరా మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు మల్లెంపాటి రామారావు మాట్లాడారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో తూము సుధాకర్, గాలి అరుణ, షేక్ రెహానా, హరి వెంకటేశ్వరరావు, కామినేని రవి, వెంపటి రాజా, యనమద్ది రామకృష్ణ, నర్వనేని సత్యం తదితరులు పాల్గొన్నారు.