ఖమ్మం రూరల్ : న్యాయస్థానం నుంచి తుదితిర్పు వెలుబడిన తర్వాతనే జాతీయ రహదారి పనులు చేపట్టాలని మరోసారి సాగు రైతులు నిరసన గళం వినిపించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ తారేడు గ్రామాల మధ్య మరోసారి ఎన్హెచ్ఏఐ అధికారులు సర్వే చేపట్టారు. పోలీస్ అధికారులతో అధికారులు. సిబ్బందితో కలిసి ఫీల్డ్ మీదికి వచ్చిన అధికారులను బాధిత రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలోనే తాము న్యాయస్థానాన్ని సంప్రదించడం జరిగిందని, ఈనెల 28వ తేదీన న్యాయస్థానం తుది తీర్పు విలువరించడం జరుగుతుందని అనంతరం రహదారి పనులు చేపట్టాలని రైతులు తేల్చి చెప్పారు.
అమరావతి టు నాగపూర్ హైవే రోడ్డుకు సంబంధించి కల్లూరు నుంచి మంగళ గూడెం వరకు సుమారు 119 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. అందులో బాగానే కామంచికల్ గ్రామం నుంచి సైతం 19 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇటీవలనే కోర్టులో వాదనలు కూడా జరిగాయని తుది తీర్పు రాకముందే బుల్డోజర్లతో వచ్చి పంట పొలాలను నాశనం చేయడం సరి కాదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఫీల్డ్ మీదికి వచ్చామని ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న పరిస్థితిని గమనించిన అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి రహదారి పనులను మొదలుపెట్టారు. దీంతో ఆమంచికల్- డోర్నకల్ ప్రధాన రహదారిపై ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతున్నది.