Chitkara University : పంజాబ్, పాటియాలా జిల్లాలోని చిట్కారా యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ ప్రచారం మొదలైంది. హాస్టల్ గదిలో దెయ్యం ఉందంటూ పుకార్లు రావడంతో భయపడ్డ విద్యార్థులు రాత్రిపూట ఆందోళన నిర్వహించారు. ఇది కాస్తా.. ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై విద్యార్థులు దాడి చేశారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. హాస్టల్ క్యాంపస్‌లోని ఫర్నీచర్ సహా అనేక ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన చిట్కార్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సెప్టెంబర్ 25, రాత్రి జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, ఆమె ఆత్మ దెయ్యంగా మారి వేధిస్తోందనే ప్రచారం అక్కడ మొదలైంది. ఇదే సమయంలో ఇందుకు సంబంధించిన దెయ్యం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తమకు రక్షణ కల్పించాలని యూనివర్సిటీ అధికారులను వేడుకున్నారు. స్పందించిన యూనివర్సిటీ సిబ్బంది హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
అసలు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎప్పుడూ, ఏ విద్యార్థినీ ఆత్మహత్య చేసుకోలేదని, అందువల్ల దెయ్యం ఉండేందుకు అవకాశం లేదని చెప్పారు. కొందరు విద్యార్థులు ఆకతాయి తనంతో బయటి నుంచి హాస్టల్ గదులకు తలుపులు వేయడం వల్ల, అది దెయ్యమే చేసిందని భయపడుతున్నారని వివరించారు. విద్యార్థులకు భద్రత కల్పిస్తామన్నారు. కానీ, దీనికి హాస్టల్ విద్యార్థులు సంతృప్తి చెందలేదు. తమ భద్రత కోసం ఆందోళనకు దిగారు. ఇది మరింత పెరగడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
కానీ, విద్యార్థులు శాంతించలేదు. దీంతో శుక్రవారం రాత్రి పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసులపైకి, పోలీసు వాహనాలపైకి దాడి చేశారు. పలు వాహనాల్ని ధ్వంసం చేశారు. క్యాంపస్‌లోని ఆస్తుల్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రాజ్‌పుర సిటీ కేఎస్ఎం ఇంచార్జి అజయ్‌పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. మరోవైపు యూనివర్సిటీలో ఒక విద్యార్థిని కనిపించకుండా పోయిందని, ఆమె దెయ్యంగా మారిందనే ప్రచారం జరగగా.. యూనివర్సిటీ అధికారులు అసలు అలాంటి విద్యార్థే లేదని చెప్పారు. అన్ని సీసీటీవీ కెమెరాలు పరిశీలించి, విద్యార్థులు భద్రతకు అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్లు తెలుస్తోంది.