వేంసూరు, ఆగస్టు 20 : కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిషత్ కారాలయం ఎదుట ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
తొలుత రైతు వేదిక వద్దకు చేరుకున్న రైతులకు మండల వ్యవసాయాధికారి రుణమాఫీపై పొంతన లేని సమాధానం చెప్పడంతో విసుగు చెందిన రైతులు ప్రదర్శనగా రోడ్డుపైకి చేరుకుని బైఠాయించారు. ‘సీఎం రేవంత్రెడ్డి డౌన్ డౌన్’ అని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ అమలుపై కొర్రీలు పెట్టడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్నదాతలు రోడ్డెక్కే దుస్థితి రాదన్నారు. రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు గ్రహీత సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతున్నకు సున్నం పెట్టకండి రేవంత్రెడ్డి సాబ్ అని అన్నారు. ఆందోళనకు బీజేపీ మండల అధ్యక్షుడు పర్స రాంబాబు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, రైతులు పాల్గొన్నారు.