ముదిగొండ, మార్చి 22: నాసిరకం మొక్కజొన్న విత్తనాలతో వల్లాపురం గ్రామంలో సుమారు సుమారు 20 మంది రైతులు వంద ఎకరాల్లో పంట నష్టపోయారు. పంట ఎత్తుగా పెరిగింది.. కానీ కంకులు చిన్న సైజ్‌లోనే ఉన్నాయి. కొన్ని కంకులైతే సరిగా గింజలు కూడా రాలేదు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన పంట 10 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బాధిత రైతులు చేతికొచ్చిన పంటను చూసి లబోదిబోమంటున్నారు. గ్రామానికి చెందిన గడ్డం అప్పిరెడ్డి అనే రైతు 10 ఎకరాలు కౌలుకు తీసుకుని యాసంగి మొక్కజొన్న సాగు చేశాడు.
పది ఎకరాల్లో కలిపి నాలుగు రకాల కంపెనీల విత్తనాలను నాటాడు. మూడు ఎకరాల్లో ‘మైకో 4060’ రకానికి చెందిన విత్తనాలు నాటాడు. పది ఎకరాల్లో పంట చూడటానికి మంచిగానే ఎదిగినా కాతకు వచ్చేసరికే ఈ మూడెకరాల్లో కంకి సైజ్ పెరగలేదు. క్రమంగా పెరుగుతుందని భావించగా పంట కోతకు వచ్చినా సాధారణ కంకితో పోలిస్తే ఈ మొక్కజొన్న కంకి సగం సైజు కూడా పెరగలేదు. వీటిలో కూడా అక్కడక్కడ సరిగా విత్తనాలు రాలేదు. పంట నష్టపోయానని భావించిన రైతు విత్తనాలు కొనుగోలు చేసిన డీలరుకు విషయం చెప్పగా సదరు కంపెనీకి తెలియజేయగా వారి ప్రతినిధులు వచ్చి పంటను పరిశీలించారు. వాతావరణంలో మార్పుల వల్ల దిగుబడి సరిగా రాలేదు.. తమ సంస్థ పెద్దలకు తెలియజేస్తామని చెప్పారు.
ఇప్పటికి నెలరోజులు దాటినా ఎలాంటి స్పందన లేదు. ఫోన్ చేస్తే మేము ఏమీ చేయలేం.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని రైతు అప్పిరెడ్డి వాపోయాడు. వ్యవసాయ అధికారులకు విషయం తెలుపగా చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇప్పటివరకూ స్పందన లేదు. పది ఎకరాల్లో ఒకేసారి విత్తనాలు నాటగా ఈ రకం మాత్రమే సరిగా పండలేదని, మిగిలిన పంట మంచిగా ఉన్నదని, భూమి, సాగువిధానంలో తేడా ఉంటే మొత్తం పంటపోతుంది కానీ కేవలం ఈ రకం మాత్రమే ఎందుకు పండదని రైతు ప్రశ్నిస్తున్నాడు. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకూ వచ్చే దిగుబడి ఈ మూడు ఎకరాల్లో 10 నుంచి 15 క్వింటాళ్లు రావటం కూడా కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
గ్రామంలో ఈ రకం విత్తనాలతో సాగుచేసిన సుమారు 20మంది రైతుల మొక్కజొన్న పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉండగా సుమారు 100 ఎకరాల్లో పంట నష్టపోతున్నారు. ఎంత తిరిగినా పరిహారంరాదని, తిరగటానికి అదనపు ఖర్చులు తప్ప ఉపయోగంలేదని మానుకున్నామని రైతులు చెబుతున్నారు. దిగుబడి సరిగా వస్తేనే పెట్టుబడులు రావటం కష్టంగా ఉందని, ఈ అరకొర దిగుబడి వల్ల తీవ్రంగా నష్టపోతామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి సరితను వివరణ కోరగా గడ్డం అప్పిరెడ్డి అనే రైతు తమకు ఫిర్యాదు చేయగా పై అధికారులకు తెలియజేశామని, వారు రెండు మూడురోజుల్లో శాస్త్రవేత్తలను పంపిస్తామని చెప్పారన్నారు. పూర్తి పరీక్షలు చేసిన తరువాత విత్తనాల్లో సమస్య ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.

నాసిరకం విత్తనాలతో మోసపోయా..
పదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. మూడెకరాల్లో వేసిన పంట మాత్రమే సరిగా దిగుబడి రాలేదు.. మిగిలిన పంట బాగానే ఉంది. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది ఈ మూడెకరాల్లో 10 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదు. విత్తనాలు అమ్మిన డీలర్‌కు తెలుపగా కంపెనీవారు వచ్చి పంట చూసి తమ సంస్థ పెద్దలకు చెబుతామని వెళ్లారు.. ఫోన్ చేస్తే బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. అధికారులు సదరు విత్తనాల కంపెనీపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి.
– గడ్డం అప్పిరెడ్డి, రైతు, వల్లాపురం, ముదిగొండ
రెండెకరాల పంట పోయింది
రెండెకరాల్లో మైకో 4060 విత్తనాలతో మొక్కజొన్న పంట సాగు చేశాను. పంట ఎదిగినా దిగుబడి మాత్రం రాలేదు. కంకి సైజు సాధారణ కంకిలో సంగం మాత్రమే ఉంది. అక్కడక్కడ విత్తనాలు కూడా సరిగా రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మళ్లీ అప్పు చేసి పంట వేయాలి.
– ఎన్నీడి చిట్టిబాబు, రైతు, వల్లాపురం, ముదిగొండ