మధిర ఫిబ్రవరి 21: సాగర్ కాలువ తూముల షటర్లు మూసి వేయడంపై రైతులు సాగర్ కాలువపై ఆందోళన చేశారు. శుక్రవారం మధిర నియోజకవర్గ చింతకాని మండలంలోని తూటికుంట్ల మేజర్ కాలువ(Thutikuntla Major Canal) వద్ద రైతులు పెద్ద ఎత్తన చేరుకొని తూటికుంట్ల మేజర్ కాలువకు నీటి విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను వేడుకున్నారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ నుంచి ఆంధ్రాకు నీటి సరఫరా చేయడం ఏంటని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలోని బోనకల్లు, చింతకాని మండలాలలోని రైతాంగానికి రావాల్సిన మేజర్, మైనర్ కాలువలకు నీటిని నిలుపుదల చేస్తూ షటర్లు దింపి ఆంధ్ర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
తూటి కుంట్ల మేజర్ కాలువ పరిధిలో సుమారు 1400 ఎకరాలు మొక్కజొన్న సాగులో ఉందని తెలిపినప్పటికి ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. వారబంది విధానంలో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. కావున అధికారులు తక్షణమే స్పందించి తూటికుంట్ల మేజర్ కాలువకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గడ్డం శ్రీనివాస్ రావు, కనగంటి భూపతి, మద్దిని వెంకటేశ్వర్లు, పంది సత్యం, సోలా రమేష్ ,కోటి రామారావు బొరిగర్ల, సత్యం షేక్ జానీ, షేక్ షరీఫ్ రాయల శ్రీనివాసరావు, రాయల పూర్ణచంద్ర రావు, తదితరులు పాల్గొన్నారు.