కొణిజర్ల, మే 5 : కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించినా దిగుమతి చేయకపోవడంతో ఓపిక నశించిన రైతులు ఆందోళనకు దిగారు. కొణిజర్ల మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వైరా-సత్తుపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతుల ఆందోళనకు సీపీఎం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు పీవై పుల్లయ్య, కంకనాల అర్జునరావు తదితరులు మద్దతు పలికారు. డీఎస్వో చందన్‌కుమార్‌ను ఘెరావ్ చేశారు.
కొణిజర్ల మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని కాంటా వేసి.. ఐకేపీ, సొసైటీ, డీసీఎంఎస్ సిబ్బంది ట్రక్‌షీట్ రాసి కొణిజర్లలోని శ్రీశ్రీనివాస రైస్ మిల్లుకు తరలించారు. ఆ ధాన్యాన్ని వారం రోజులుగా దిగుమతి చేయకపోవడంతో రైతులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం డీఎస్వో చందన్‌కుమార్ మిల్లు వద్దకు చేరుకొని మిల్లుకు కేటాయించిన ధాన్యం కోటా 15 వేల క్వింటాళ్ల నిల్వ సామర్థ్యం పూర్తయిందని, ధాన్యం వాహనాలను వైరాలోని ఓ మిల్లుతోపాటు హనుమకొండ జిల్లాలోని మరో మిల్లుకు తరలించాలని సూచించారు.
దీంతో కోపోద్రిక్తులైన రైతులు ట్రక్‌షీట్‌లో కొణిజర్లకు చెందిన మిల్లు పేరు రాసి ఉంటే మరో మిల్లుకు తరలించాలనడం ఏమిటని ప్రశ్నించి రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న ఎస్సై జీ.సూరజ్, ఇన్చార్జి తహసీల్దార్ రాము, ఆర్ఐ రమేశ్, అశోక్ ఆందోళన వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. విషయాన్ని సివిల్ సైప్లె ఉన్నతాధికారులకు తెలియజేశారు. ప్రస్తుతానికి మిల్లు వద్ద ట్రాక్టర్లలో ఉన్న ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని అధికారులు యజమానికి సూచించడంతో అంగీకరించాడు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.