ఖమ్మం కమాన్బజార్/కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 28 : రుణమాఫీ చేయాలని, రైతుల అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు, భద్రాద్రి జిల్లా సీపీఐ కార్యదర్శి సాబీర్పాషా, ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్లు మాట్లాడారు.
రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం గందరగోళంగా వ్యవహరిస్తున్నదని, రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు కూడా మాఫీ వర్తించడం లేదన్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందన్నారు. 2018కి ముందు రుణాలు తీసుకున్న వారికి సైతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా విషయంలో ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ.. వర్షకాలం పంటలకు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వడ్లతోపాటు దొడ్డు వడ్లకు కూడా రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో రైతు సంఘం నాయకులు పోటు ప్రసాద్, దండి సురేష్, మౌలనా, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, కొమారి హన్మంతరావు, గుగులోత్ రాంచందర్, నరజాతి రమేశ్, యాస రోశయ్య, ఇమ్మానియేల్, సీతారామిరెడ్డి, బండి నాగేశ్వరరావు, ఇట్టి వెంకట్రావ్, శనిగరపు శ్రీను, గిరి, ఇరుకులపాటి సుధాకర్, విజయ్, మోహన్, అప్పారావు పాల్గొన్నారు.