ఖమ్మం వ్యవసాయం, జనవరి 6 : వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించేందుకు మార్కెటింగ్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చినా క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టడం లేదు. దీంతో పంట నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతాన్ని వ్యాపారులు చేతులతోనే నిర్ధారిస్తుండడంతో ఆరుగాలం పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ఏటా ధర విషయంలో ఖరీదుదారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. దీనిపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంట కొనుగోలు చేసిన ఖరీదుదారులు సొమ్ము చేసుకుంటుండగా.. రైతులు మద్దతు ధర పొందలేని పరిస్థితి నెలకొన్నది.
పొరుగు జిల్లాల నుంచి విక్రయానికి..
రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఒకటి. జిల్లా రైతాంగంతోపాటు పొరుగున ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నుంచి రైతులు తమ పంట ఉత్పత్తులను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో రైతులు, వ్యాపారులు, కార్మికుల సౌకర్యార్థం మార్కెట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని గతంలోనే అందుబాటులోకి తెచ్చారు. నిరంతరం సీసీ ఫుటేజీల పర్యవేక్షణ, జీపీఆర్ఎస్ కాంటాలు, పత్తి క్రయవిక్రయాల్లో ఈ-నామ్ విధానం, మిర్చి విక్రయాల్లో సైతం ఈ-టామ్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో మార్కెట్లోని అన్ని యార్డుల్లో పూర్తిస్థాయిలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినైట్లెంది. అంతేకాక యార్డుకు రైతులు తీసుకొచ్చిన పంట ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం తెలుసుకొని సీసీఐ తేమ శాతం నిర్ధారణ యంత్రాలతో కొనుగోళ్లు చేపడుతుండగా.. ధాన్యం కొనుగోళ్లలో సైతం తేమ శాతం నిర్ధారణ యంత్రాలను వినియోగిస్తూ గ్రేడింగ్ చేసి అందుకనుగుణంగా కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇక ఎండు మిర్చిని సైతం పంట నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఖరీదుదారులు ధర నిర్ణయించి కొనుగోలు చేయాల్సి ఉండగా.. చేతులతోనే పంటను తడిమి చూసి తమకు నచ్చిన రేటు నిర్ణయించి కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు తమ పంటను అమ్ముకోవాల్సి వస్తున్నది.
స్టోరూంలోనే యంత్ర పరికరాలు
మిర్చి పంటను రైతులు ఏటా నవంబర్ మొదలుకొని ఏప్రిల్ వరకు విక్రయానికి ఖమ్మం మార్కెట్‌కు తీసుకొస్తుంటారు. దిగుబడులు మంచిగా ఉండడం.. సరుకు ఎక్కువగా మార్కెట్‌కు వస్తుండడంతో గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మిర్చి పంట నాణ్యత ప్రమాణాల పరిశీలన కోసం యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. మూడు యంత్రాల కొనుగోలుకు రూ.36 లక్షలు వెచ్చించి మార్కెట్‌కు అందజేసింది. అయితే యంత్రాలు మార్కెట్‌కు వచ్చిన ఆరంభంలో ఒకటి రెండుసార్లు మినహాయించి తర్వాత వాటిని వినియోగించిన దాఖలాలే లేవు. లాట్లు ఎక్కువగా వస్తున్నందున నాణ్యతా ప్రమాణాలు చూడడం కుదరడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఖరీదుదారులు కావాలనే యంత్రాలను వాడుకలోకి తేకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సదరు యంత్రాలను వాడుకలోకి తీసుకొచ్చినైట్లెతే పంట నాణ్యత తెలియడంతోపాటు రైతులకు ధర గిట్టుబాటు అయ్యే అవకాశం ఉన్నది.
శాస్త్రీయ పద్ధతి పాటించాలి : అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్
శాస్త్రీయ పద్ధతిలోనే మిర్చి నాణ్యతను పరిశీలించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సంబంధిత అధికారులను అదేశించారు. శనివారం మార్కెట్‌ను సందర్శించిన ఆయన తొలుత సెక్రటరీ చాంబర్లో ఇంచార్జి సెక్రటరీ, గ్రేడ్-టూ అధికారి బజార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ.అలీంతో సమావేశమయ్యారు. యార్డుకు వస్తున్న మిర్చి బస్తాలు, రైతులకు అందుతున్న మద్దతు ధర తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం మిర్చి యార్డులో నిల్వ ఉన్న బస్తాల్లోని పంటను పరిశీలించారు. పంట నాణ్యతను ఎలా నిర్ధారిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. లాట్ వద్దే జెండా పాట పెడుతున్నామని, మిగిలిన లాట్లకు ఖరీదుదారులు చెప్పిన రేటు ప్రకారంగా ధరలు ఉంటున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఆ పద్ధతి సరికాదని, శాస్త్రీయ విధానంలోనే నాణ్యతను నిర్ధారణ చేయాలన్నారు. మార్కెట్లోని యంత్రాలను వాడుకలోకి తేవాలన్నారు. లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన యంత్రాలను పక్కన పడేయడం పట్ల అదనపు కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.