ఇల్లెందు రూరల్/ ఆళ్లపల్లి, జూలై 16: ముందస్తుగా వేసిన మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా అవసరం రావడంతో బస్తాల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. సీజన్లో వ్యవసాయ పనులు వదిలి సొసైటీ కార్యాలయాలు, గోడౌన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు. పీఏసీఎస్ అధికారుల నిబంధనలతో చివరికి యూరియా తమకు అందుతుందో.. లేదోనని ఇల్లెందు, ఆళ్ళపల్లి మండలం చలగట్ట గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం తెల్లవారుజామున చేరుకున్న రైతులు వరుసలో నిల్చున్నారు.
ఆధార్ కార్డుకు ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున యూరియా అందిస్తుండడంతో సరిపోతుందా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు. ఆళ్ళపల్లి మండలం చలగట్ట పీఏసీఎస్ వద్దకు తెల్లవారుజామునే చేరుకున్న రైతులు బస్తాల కోసం నానా పాట్లు పడ్డారు. క్యూలో నిలబడే ఓపిక లేకపోవడంతో పీఏసీఎస్ ఆవరణలో, రోడ్ల వెంట చెట్ల కింద కూర్చొని అవస్థలు పడ్డారు.
అయితే ఒక్కో బస్తా ధర రూ.260 ఉండగా.. దళారులు రూ.550 నుంచి రూ.600 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో యూరియా కోసం ఇబ్బంది పడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే యూరియా కష్టాలు మొదలయ్యాయని అన్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని దిగులు చెందుతున్నారు. వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.