యూరియా సమస్య మరింత జటిలమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సీజన్ ఆరంభం నుంచీ రైతులు నానా అవస్థలు పడుతున్నప్పటికీ సర్కార్ ఎరువుల సమస్యను ఏమాత్రం పరిష్కరించలేకపోతున్నది. ఎక్కడచూసినా ఇప్పటికీ అదే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల క్యూలైన్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ పనులు మానుకొని మరీ పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు. వేసిన పంటలను ఎలాగైనా దక్కించుకోవాలనే తపనతో సొసైటీ కార్యాలయాల చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.
కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 6 : ప్రస్తుత సీజన్లో పంటలకు యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. అదును పోయిన తర్వాత ఎరువులు ఎలా వేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తున్నారు. శనివారం సుజాతనగర్ మండలానికి చెందిన రైతులు సుజాతనగర్లోని సొసైటీ గోడౌన్ వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
ఓ వైపు మంత్రులు రాష్ట్రంలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని చెబుతున్నా రైతులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. మంత్రులు చెప్పినట్లుగా యూరియా నిల్వలు పుష్కలంగా ఉంటే రైతులు ఎందుకు క్యూలు కడతారంటూ సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. ఎండలో తాము ఎక్కువసేపు నిలబడలేని వారు తమవంతు వచ్చేవరకు క్యూలైన్లో చెప్పులు ఉంచి పక్కన చెట్టునీడన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు.
అశ్వాపురం, సెప్టెంబర్ 6 : మండలవ్యాప్తంగా రైతన్నలు తీవ్రమైన యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు. మూడ్రోజులుగా యూరియా సరఫరా లేకపోవడంతో శనివారం ఉదయం 6గంటల నుంచి అశ్వాపురం సొసైటీ కార్యాలయంతోపాటు నెల్లిపాక సొసైటీ కార్యాలయంలో రైతులు బారులు తీరారు. ఉదయం 9గంటల సమయంలో వర్షం వచ్చినప్పటికీ రైతులు మాత్రం అధికారులు వచ్చేంత వరకు వర్షంలో తడుస్తూ క్యూలో నిలుచున్నారు.
ఒక్కో సొసైటీ కార్యాలయంలో కేవలం 250 బస్తాల యూరియా మాత్రమే అందుబాటులో ఉండటంతో రైతులు మధ్యాహ్నం వరకు లైన్లో ఉన్నప్పటికీ కేవలం 2కట్టల చొప్పున మాత్రమే ఇచ్చారు. దీంతో పది ఎకరాల పైబడి వ్యవసాయం చేస్తున్న రైతులు తమకు రెండు కట్టలు సరిపోవని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో యూరియా కోసం తోపులాట జరగడంతో పోలీసుల పహారాలో యూరియా కట్టలు పంపిణీ చేశారు. రెండేసి కట్టల కోసం రోజుల తరబడి సొసైటీ కార్యాలయాల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.