అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలవాల్సిందిపోయి వారినెత్తినే ప్రభుత్వం ‘హస్తం’ పెడుతున్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన పదేళ్లలో గత కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలువగా.. ఇప్పటి ఈ కాంగ్రెస్ సర్కారు మాత్రం ఈ ఏడాది రైతన్నలను నిండా ముంచింది. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి కర్షకుల ఉసురుతీస్తున్నది. గొప్పగా చెప్పుకున్న రుణమాఫీ సైతం కొద్దిమందికే చేసి చేతులు దులుపుకుంది.
రైతుబంధు స్థానంలో తెచ్చిన ‘రైతు భరోసా’తో ఎకరానికి రూ.15 వేలు పంటల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి.. ఈ వానకాలంలో మొత్తానికే ఎగనామం పెట్టింది. మరోవైపు పత్తి పంట జోరుగా మార్కెట్‌కు వస్తున్నప్పటికీ సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అసలే ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు.. మరోవైపు తెగుళ్లతో పంటల దిగుబడి రాక సతమతమవుతున్న అన్నదాతలకు ఏమాత్రం సాయం అందించకుండా వారి నడ్డి విరుస్తున్న చరిత్ర కాంగ్రెస్ సర్కారుకే చెందుతుందనడంలో సందేహం లేదు.
-భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 4,77,538 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే వర్షాల ఆలస్యం కారణంగా పంటల సాగు లేటుగా ప్రారంభమైంది. తరువాత కురిసిన భారీ వర్షాలకు చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో అప్పటికే చేతికొస్తున్న పంటలన్నీ కొట్టుకుపోయాయి. మరోవైపు ఇదే వర్షాలకు పత్తి పంట కొన్ని చోట్ల పూత, కాత లేని దశలో ఉంది. మరికొన్ని చోట్ల చేతికొచ్చినా సీసీఐ కేంద్రాలు పెట్టింది లేదు. కర్షకుల పత్తిని కొనుగోలు చేసింది లేదు. ఇక మిర్చి పంటలు నీటమునగడంతో ఆ రైతులకు భారీగానే నష్టం వాటిల్లింది. జిల్లాలో 1,61,731 ఎకరాల్లో వరి, 1,98,268 ఎకరాల్లో పత్తి, 81,242 ఎకరాల్లో జొన్న పంటలను రైతులు సాగుచేశారు. ఇతర పంటలతో కలుపుకొని మొత్తంగా 4,77,538 ఎకరాల్లో పంటలు సాగైనా ప్రభుత్వం నుంచి భరోసాలు, గిట్టుబాటు ధరలు లేకుండా పోయాయి.
గడిచిన పదేళ్లపాటు సాగును సంబురంగా చేసుకున్న అన్నదాతలను ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాలా ఆవేదనకు గురిచేస్తోంది. మూడు దఫాల్లో రుణమాఫీ చేశామంటూ గప్పాలు చెప్పినా తీరా చూస్తే అంతా అరకొరే. ఇక రైతుభరోసాదీ, పంటల పరిహారానిదీ అదేతీరు. దీంతో భద్రాద్రి జిల్లావ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బ్యాంకుల వద్ద ధర్నాలు చేసినా, కలెక్టరేట్‌ను ముట్టడించినా వారికి ఫలితం దక్కలేదు. దీంతో గడిచిన పదేళ్లలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని ఎంత ఠంఛనుగా అందించిందో అన్నదాతలు గుర్తుచేసుకుంటున్నారు. వంచించిన కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.
పంట చేతికొచ్చేసరికి దళారులు రంగప్రవేశం చేశారు. కాపు కాసి మరీ ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఏటా 5 నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తున్నది. దీంతో దళారులు రాజ్యమేలుతున్నారు. ఏకంగా రైతుల ఇంటికెళ్లి మరీ వారి పత్తిని కొంటున్నారు. తక్కువ ధర చెల్లిస్తూ వారిని నిండా ముంచుతున్నారు. ఈ ఏడాది 2,01,216 ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేయగా.. 16 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పంట పండించడం ఒక ఎత్తయితే.. రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం మరో ఎత్తయింది. ఇక చేతిలో పెట్టుబడి లేకుండా ఎలా సాగు చేయాలో అర్థం కాని పరిస్థితి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ఠంఛనుగా వచ్చేది. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా కూడా రాలేదు. చేతిలో సమయానికి పెట్టుబడి లేకపోవడంతో మా వరి పంటకు తెగులు సోకింది.
-కె.వీరభద్రకుమార్, రైతు, చిననల్లబెల్లి, దుమ్ముగూడెం
రుణమాఫీ కోసం బ్యాంకులు చుట్టూ తిరిగాను. ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్నవారే లేరు. ఎక్కడైనా మూడుసార్లు ధర్నా చేసిన రైతులు ఉన్నారా అంటే.. అది చండ్రుగొండలోనే. మేం రుణమాఫీ కోసం తిరుగుతుంటే పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదు.
-గుగులోత్ రమేశ్, రైతు, తిప్పనపల్లి, చండ్రుగొండ మండలం