ఎర్రుపాలెం, మార్చి 14 : మండల పరిధిలోని మొలుగుమాడు గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వరరావు (37) అనే రైతు అప్పుల బాధలు భరించలేక గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు తనకున్న రెండున్నర ఎకరాల పొలంతో పాటు మరో అయిదు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు సుమారుగా రూ.20 లక్షలు ఉన్నాయని వాటిని తీర్చలేననే భయంతో భార్య దగ్గర కూడా పలుమార్లు చెప్పి బాధపడినట్లు చెప్పారు.
అదే బెంగతో ఈ నెల 7న ఉదయం పొలం వద్ద గడ్డి మందు తాగి ఇంటికి వచ్చి మంచంపై పడుకున్నాడు. అపస్మారకస్థితికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు ఆర్థిక స్తోమత లేనందువల్ల రెండో రోజు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. శుక్రవారం మృతుడి భార్య వరలక్ష్మి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.వెంకటేశ్ తెలిపారు. వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.