ఖమ్మం రూరల్, ఏప్రిల్ 10 : ఖమ్మం రూరల్ మండలం పోలెపల్లి గ్రామంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు సాగు రైతులు, మరోవైపు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. రైతులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. 50 ఏళ్ల క్రితం నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నిర్మాణం కోసం ఎన్ఎస్పీ అధికారులు మట్టి కట్టల కోసం తమ భూములను అగ్రిమెంట్ చేసి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం తిరిగి సదరు భూముల్లో పంటల సాగు చేపట్టడం జరిగిందన్నారు.
Khammam Rural : పంట భూముల పైకి జేసీబీ, బుల్డోజర్ల రాక.. పోలెపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
1960 సంవత్సరం నుంచి భూమి శిస్తు సైతం చెల్లిస్తూ పంటలు సాగు చేసుకుంటున్నట్లు చెప్పారు. అయితే నెల రోజుల నుంచి ఖమ్మం నగరం, రూరల్ మండలం రెండు వైపులా మున్నేరు వాగుకు ఇరువైపులా ప్రభుత్వం రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. ఈ నిర్మాణంలో ప్రైవేట్ భూములు కోల్పోయిన వారికి ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అందుకు సాగు చేసుకుంటున్న తమ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపించారు.
తమ భూములను లాక్కోవద్దని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. అయినప్పటికీ పోలీసు, అధికారులు బలవంతంగా బుల్డోజర్లను పెట్టి పంట భూములని కూడా చూడకుండా నాశనం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రిటర్నింగ్ వాల్ పక్కన టెంట్ వేసి రైతులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే జేసీబీలు, బుల్డోజర్లు మరోసారి సదరు భూముల్లోకి రావడంతో రైతులు అడ్డుకుని ధర్నాకు దిగారు. పోలీసు అధికారుల కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డారు. ఆడపిల్లలకు కట్న కానుకలుగా ఇచ్చిన భూములను లాక్కోవద్దని, అలా చేస్తే 200 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నిరసనకు సీపీఎం మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి, పలు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.
Khammam Rural : పంట భూముల పైకి జేసీబీ, బుల్డోజర్ల రాక.. పోలెపల్లిలో తీవ్ర ఉద్రిక్తత