ఖమ్మం, జనవరి 30 : దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం నెలనెలా చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఆహార భద్రతా కార్డుల్లో ఎంతో మంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కార్డుల్లో పేరున్న వారిలో కొందరు మరణించొచ్చు. మరికొందరు శాశ్వతంగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయి ఉండొచ్చు. ఇంకొందరు వివాహం చేసుకుని ఆ ఇంటి నుంచి వెళ్లి ఉండొచ్చు. అయినప్పటికీ వారి పేరుపై కుటుంబ సభ్యులు రేషన్ తీసుకుంటున్నట్లు కేంద్రం నిర్ధారణకు వచ్చి, బోగస్ కార్డుల ప్రక్షాళనకు ఈ-కేవైసీ ప్రక్రియకు తెర తీసింది. గతేడాది సెప్టెంబర్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్రం ఈ నెలాఖరు వరకే గడువు అని ముందుగా ప్రకటించింది. కానీ.. లక్షలాది మంది ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉండడంతో గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.
రేషన్ కార్డు ఈ-కేవైసీ నమోదులో ఖమ్మం జిల్లా 7వ స్థానంలో ఉంది. మేడ్చల్ జిల్లా 92.48 శాతం నమోదుతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 86.45 శాతం సాధించి రెండో స్థానం, హైదరాబాద్ జిల్లా 85.30 శాతంతో మూడోస్థానం, కరీంనగర్ 82.86 శాతంతో నాలుగో స్థానం, నిర్మల్ 77.72 శాతంతో ఐదో స్థానం, సంగారెడ్డి 77.10 శాతంతో ఆరోస్థానం, ఖమ్మం జిల్లా76.99 శాతంతో ఏడో స్థానంలో నిలిచాయి. అలాగే పొరుగు జిల్లా భద్రాద్రి 70.01 శాతం నమోదును సాధించింది. 61.79 శాతం నమోదు చేసి మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది.
జిల్లావ్యాప్తంగా మొత్తం రేషన్ దుకాణాలు 748 ఉండగా.. వీటి పరిధిలో 4,11,347 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఆయా కార్డులపై మొత్తం 11,32,871 మంది పేర్లున్నాయి. ఆదివారం నాటికి వీరిలో 8,72,197 మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు. నమోదు శాతం 76.99. 100 శాతం ప్రక్రియ పూర్తి కావాలంటే ఇంకా 2,60,674 మంది సభ్యులు ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉన్నది.
రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ రేషన్ దుకాణానికి వెళ్లి డీలర్ వద్ద ఈ-పాస్ మిషన్లో ఈ-కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియతో ఆహార భద్రత కార్డులను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. బతుకుదెరువు కోసం బయట ప్రాంతాలకు వెళ్లిన వారైనా, ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారైనా ఉన్నఫళంగా వచ్చి ఈ-కేవైసీ చేయించుకోవాలంటే ఇబ్బందే. సాధారణంగా వారంతా సెలవులు వస్తే స్వస్థలాలకు వచ్చి ఈ-కేవైసీ చేయించుకోవాలనుకుంటారు. మరోవైపు ఈ-కేవైసీ చేయించుకోని వారి పేర్లను కార్డు నుంచి తొలగిస్తారనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఈ విషయంలో అధికారులు సరైన స్పష్టత ఇవ్వడం లేదనే భావన ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది.