ఖమ్మం రూరల్, మే 05 : తీరొక్క ఉద్యాన పంటల సాగుకు చిరునామాగా ఖమ్మం జిల్లాకు దశాబ్దాలుగా పేరుంది. సారవంతమైన నేలలు, నైపుణ్యం కలిగిన రైతులు జిల్లా సొంతం కావడంతో ఇప్పటికే ఉద్యాన పంటల సాగులో అనేక అద్భుతాలు ఆవిష్కరణ అయ్యాయి. అదే వరుసలో జిల్లాలో తొలిసారిగా జపాన్ రకానికి చెందిన మియాజాకీ మామిడి పంట సాగు జరిగింది. ఐదేళ్ల తర్వాత పంట చేతికి రావడంతో సాగు చేసిన రైతుతో పాటు, ప్రత్యక్షంగా మామిడి పండ్లను చూసిన జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం పంచాయతీలోని శ్రీ సిటీలో నివాసం ఉంటున్న శ్రీసిటీ చైర్మన్, ప్రముఖ బిల్డర్, రైతు గరికపాటి వెంకట్రావు ఈ మామిడి సాగు చేపట్టారు.
ఉద్యాన అధికారి సలహాతో ఐదేళ్ల క్రితం బెంగళూరు నుంచి మియాజాకి మొక్కలను తీసుకువచ్చి శ్రీ సిటీ లోని తన వ్యవసాయ క్షేత్రంలో నాటారు. వాటిలో మెజారిటీ మొక్కలు గతేడాది నుంచి ఖాతా రావడం ప్రారంభించాయి. ఈ సంవత్సరం పూర్తి పరిపక్వత చెంది మియాజాకీ మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ముందే పసిగట్టిన రైతు వెంకట్రావు గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడియం నర్సరీ నుంచి మరో 50 మొక్కలను కొనుగోలు చేసి ఇదే వ్యవసాయ క్షేత్రంలో నాటారు.
సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభించే మియాజాకీ మామిడికి ప్రపంచ మార్కెట్లో (జపాన్, సింగపూర్) లో కేజీ రూ.2.50 లక్షలు ధర పలుకుతుంది. జపాన్లోని మియాజాకీ ప్రాంతానికి పరిమితమైన ఈ మామిడి సాగు మన రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో చేపట్టి మంచి ఫలితాన్ని రాబట్టిన వెంకట్రావుకు ఉద్యాన శాఖ, ఆదర్శ రైతుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
Khammam Rural : ఖమ్మంలో ఖరీదైన మామిడి.. కిలో రూ.2.50 లక్షలు