
ఖమ్మం, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ పనితీరు ఉంటుంది. ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటా. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాజకీయ అవగాహన తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నానని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ కార్యకర్తలను సైనికుల్లా తయారు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆయన గురువారం ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే
‘నమస్తే’ : జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీ ప్రాధాన్యాలేమిటి?
తాతా మధు : జిల్లాలో బలమైన పార్టీ టీఆర్ఎస్. ఎన్నిక ఏదైనా ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టేలా ప్రతి కార్యకర్తకు రాజకీయంగా అవగాహన కల్పిస్తాం. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దీటుగా జవాబు ఇచ్చేలా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్తాం. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా ప్రణాళిక రూపొందిస్తాను.
నమస్తే : పార్టీ బలోపేతానికి కార్యాచరణ ఏమిటి?
తాతా మధు : జిల్లాలో ఇప్పటికే పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తాను. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తాను. పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని అంశాలపై దృష్టిసారిస్తాను.
నమస్తే : పార్టీ అధ్యక్షుడిగా నిర్వహించబోయే కార్యక్రమాలేమిటి?
తాతా మధు : టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జిల్లాలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తాం. పార్టీ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని, బాధ్యత ఏమిటో కార్యకర్తలకు వివరిస్తాం. ప్రజలకు టీఆర్ఎస్ను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాను. పార్టీ ఎలా జవాబుదారో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మన భుజస్కందాలపై ఏవిధంగా ఉందో ప్రతి కార్యకర్తకు వివరిస్తాం.
నమస్తే : రాజకీయ అవగాహన తరగతులు ఎలా నిర్వహిస్తారు?
తాతా మధు : కార్యకర్తలు, నాయకులకు వివిధ రాజకీయ అంశాలు, మారుతున్న పరిస్థితులు, పరిణామాలపై అవగాహన కల్పించడం ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలకు దీటైన సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇందుకు పార్టీ అధినేత అనుమతితో త్వరలో జిల్లా స్థాయి నాయకులకు అవగాహన తరగతులు నిర్వహించాలని సంకల్పించాం. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం.
నమస్తే : ఏఏ అంశాలపై పార్టీ ప్రధానంగా దృష్టిసారించనున్నది?
తాతా మధు : పార్టీని రాష్ట్రంలో ఆదర్శంగా ఉండేలా మలుచుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇందుకు అందరి సహకారం అవసరం. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించడానికి కారణాలు, చారిత్రక అంశాలను ప్రతి ఒక్కరికీ మరోసారి తెలియజేస్తాను. ఉద్యమం పునాదులపై ఏర్పడిన టీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్షేత్రంలో పనిచేస్తుంది. టీఆర్ఎస్ కోసం పరిశ్రమించే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. జెండా మోసేవారికి పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుంది. పార్టీ జిల్లా కార్యాలయం విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కార్యకర్తలకు అందుబాటులో ఉంటా. పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తాను.