భద్రాచలం, జూన్ 3 : భద్రాచలంలో గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరిరావు భద్రాచలంలో విలేకరులకు తెలిపిన వివరాలు.. కూనవరం నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డులో ఇసుక రీచ్ సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు.
ఒక వాహనంలో 4.300 కిలోల ఎండు గంజాయి దొరికింది. దానిపై ప్రయాణిస్తున్న ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన బానోత్ వీరేందర్‌ను, రమణగుట్ట ప్రాంతానికి చెందిన గుత్తికొండ యశ్వంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఏపీలోని సీలేరు నుంచి ఖమ్మం జిల్లాకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు వారిద్దరు చెప్పారు. మరో వాహనం నుంచి 5.200 కిలోల ఎండు గంజాయి దొరికింది.
ఈ వాహనంపై ప్రయాణిస్తున్న ఖమ్మం నగరంలోని లెనిన్ నగర్‌కు చెందిన షేక్ ఖాసీంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ముగ్గురి నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనపర్చుకున్నారు. వీరిని భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు ఖలీల్ అహ్మద్, జమాల్ షరీఫ్, కానిస్టేబుళ్లు శివకుమార్, నాగరాజు, ప్రసన్నకుమార్, ఉపేందర్ పాల్గొన్నారు.