కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 21: ఈ నెల 28 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై విద్య, రెవెన్యూ, పోలీసు, వైద్య, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, పోస్టల్, ఆర్టీసీ అధికారులతో ఐడీవోసీలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ నెల 28న ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయని అన్నారు. ఫస్టియర్‌లో 10,200 మంది, సెకండియర్‌లో 9,277 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇందుకోసం 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే వీటన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 16 పోలీస్స్టేషన్లలో ప్రశ్నపత్రాలు భద్రపర్చాలని సూచించారు. 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది శాఖాపరమైన అధికారులు, 13 మంది అదనపు పర్యవేక్షకులు విధులు నిర్వహించనున్నట్లు చెప్పారు.
మూడు సిట్టింగ్ స్కాడ్స్ బృందాలను, ఐదు కస్టోడియన్స్ బృందాలను నియమిస్తున్నట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బందికి డ్యూటీ జారీ చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. సమీపంలోని జిరాక్సు సెంటర్లు మూసివేయించాలని, పరీక్ష కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై చెక్‌లిస్ట్ తయారు చేయాలని ఆదేశించారు. పరీక్ష కే్రందాల్లో అత్యవసర వైద్య కేంద్రాలు, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షల గురించి సందేహాల నివృత్తి కోసం విద్యార్థులకు హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. సందేహాలుంటే 9704661714, 98469130 69 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి, డీఆర్వో రవీంద్రనాథ్, డీఎల్పీవో రాజీవ్‌కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ శిరీష, డీఈవో వెంకటేశ్వరాచారి, వివిధ శాఖల అధికారులు వెంకటరత్నం, ప్రభాకర్‌రావు, విజయబాబు, శేషాంజన్‌స్వామి, మురళి తదితరులు పాల్గొన్నారు.