మధిర, మే 15: మధిర మండలంలో బుధవారం పర్యటించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్.. సివిల్ సబ్ కోర్టు ఏర్పాటు కోసం ఇక్కడి భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం మధిరకు సంబంధించిన సివిల్ కేసులన్నీ సత్తుపల్లి కోర్టులో విచారణ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మధిరకు కోర్టు మంజూరైనప్పటికీ ఏర్పాటుకు భవనాలు లేవు. దీంతో మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు పలుసార్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి కోర్టు ఏర్పాటుపై వినతులు అందజేశారు. దీంతో బుధవారం ఆయన స్వయంగా మధిర వచ్చి కోర్టు ఏర్పాటుకు అనువుగా ఉండే పలు భవనాలను పరిశీలించారు. మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ జడ్జి కార్తీక్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల అప్పారావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, మధిర సీఐ మధు పాల్గొన్నారు.