రఘునాథపాలెం, డిసెంబర్ 4: గొత్తికోయల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు కుటుంబాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరామర్శించారు. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలోని ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు స్వగృహానికి వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు.. శ్రీనివాసరావు భార్యాబిడ్డలను పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. ముందుగా శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, తాతా రఘురాం, తుపాకుల ఎలగొండస్వామి, సుడా డైరెక్టర్ ఖాదర్బాబు, పంతులు నాయక్, గుర్రం జగన్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.