కారేపల్లి, అక్టోబర్ 16 : ప్రతి ఒక్కరూ అన్ని రకాల పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ టి.గీతాబాయి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం కోమట్లగూడెంలో గల అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ మాస్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన పోషక ఆహారాల పట్ల అవగాహన కల్పించారు. అదేవిధంగా ఏడు నెలల నుండి పిల్లలకు ఏ విధమైన ఆహారం తినిపించాలనే అంశంపై వివరించారు.
మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందజేస్తున్న బాలామృతం ఏ విధంగా పెట్టాలనే దానిపై తల్లులకు తెలియజేశారు. అదేవిధంగా మునగాకు, కరివేపాకు పొడిని తయారు చేసే విధానాన్ని తెలిపారు. అంతకుముందు అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషక ఆహార ప్రదర్శనను చిన్నారుల తల్లిదండ్రులకు, గ్రామస్తులకు చూపించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ సెక్టర్ పరిధి అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Karepally : ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి : ఐసీడీఎస్ సూపర్వైజర్ గీతాబాయి