ఖమ్మం రూరల్, జనవరి 19 : రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఉంటాయని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న ప్రాణ నష్టాన్ని తగ్గించి, ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యానికి చేరాలనే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన‘అరైవ్ అలైవ్’ అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖమ్మం రూరల్ మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంలో అలసత్వం వంటి కారణాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు.
ఈ పరిస్థితిని మార్చేందుకు శిక్షలతో పాటు అవగాహన అత్యంత అవసరమని భావించి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. జనసమర్థ ప్రదేశాల్లో పౌరులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. యువతే మార్పునకు నాంది కావునా రోడ్డు భద్రతపై యువతలో చైతన్యం వస్తే సమాజం మొత్తం మారుతుందన్న నమ్మకంతో విద్యార్థులు, యువకులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులతో, గాయపడిన బాధితులతో నేరుగా మాట్లాడుతున్నామని తెలిపారు. వారి అనుభవాలు, బాధలు వింటే ఎవరి హృదయమైనా కదిలిపోతుందని, ఇది ప్రజల్లో ఆలోచన మార్పుకు దోహదపడుతుందని చెప్పారు. ఈ ప్రత్యక్ష సంభాషణల ద్వారా ప్రజల్లో బాధ్యత భావం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసులు మాత్రమే కాకుండా మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు, డ్రైవర్లు, రైతులు, వ్యాపారులు, మత పెద్దలు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు అందరూ భాగస్వాములుగా ఉండాలని కోరారు. రోడ్డు భద్రత అనేది పోలీసుల ఒక్కరి బాధ్యత కాదని, సమాజం మొత్తంగా ముందుకు వస్తేనే ప్రమాదాలను తగ్గించగలమన్నారు. ‘అరైవ్ అలైవ్’ ఒక ఉద్యమంగా మారాలి ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక అవగాహన కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఇతరులను కూడా ప్రోత్సహిస్తేనే నిజమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ సీఐ ముష్కరాజ్, పలువురు ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.