కారేపల్లి, అక్టోబర్ 17 : సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హెల్త్ సూపర్వైజర్ బి. విజయలక్ష్మి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం మోట్లగూడెం ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం (హెల్త్ సబ్ సెంటర్) ఆధ్వర్యంలో రేలకాయలపల్లి సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. గుండెపోటు వచ్చినప్పుడు తక్షణ సహాయం అందించడానికి సీపీఆర్ ఎలా చేయాలో చేసి చూపించారు. సీపీఆర్ అనేది ఒక అత్యవసర ప్రాణ రక్షణ పద్ధతి అని, ఎవరైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్తాన్ని, ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి సీపీఆర్ సహాయ పడుతుందన్నారు. అంతకుముందు విద్యార్థులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి మహాలక్ష్మి, ఏఎన్ఎంలు కళావతి, సునీత, ఆశా కార్యకర్త పద్మ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.