కారేపల్లి, జూన్ 28 : వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం వైద్యాధికారి భూక్య సురేశ్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సురేశ్ విద్యార్థులకు హ్యాండ్ వాష్, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల సమీప ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండడం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు తాము నివసించే గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని జి.ఝాన్సీ సౌజన్య, స్థానిక ఏఎన్ఎం ఎ.చందన, సులోచన, సరస్వతి, ఉపాధ్యాయులు స్వాతి, విజయ, మమత, ఆశా కార్యకర్తలు దేవకరణ, కళ్యాణి, విద్యార్థులు పాల్గొన్నారు.