ఖమ్మం రూరల్, అక్టోబర్ 6 : హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో ట్రాఫిక్ కష్టాలు పడుతున్నారు వాహనదారులు. ఖమ్మం బైపాస్ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గంటల తరబడి రోడ్డుపై నిరీక్షిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చే రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. ఖమ్మం కాల్వొడ్డు వద్ద ఉన్న పాత బ్రిడ్జి వద్ద తీగల వంతెన నిర్మాణం కొనసాగుతుండడంతో ఆ బ్రిడ్జిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అప్పుడప్పుడు కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో ఇక ఏకైక మార్గం బైపాస్ కావడంతో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు, జిల్లావాసుల వాహనాలు సైతం ఈ రహదారి గుండానే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో కరుణిగిరి వద్ద మున్నేరుపై ఉన్న బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతున్నది.
దీంతో అటు నాయుడుపేట సెంటర్ వరకు.. ఇటు ఖమ్మంలో కొత్త బస్టాండ్ వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోతున్నది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేసేవరకు వాహనదారులకు గంటల తరబడి రోడ్డుపై నిరీక్షణ తప్పడం లేదు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లే నిత్యం వేలాది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వీటికితోడు వివిధ పనుల నిమిత్తం ఖమ్మం నగరానికి ఆయా గ్రామాల నుంచి వచ్చే ఆటోలు, కార్లు, ఇతర వాహనాలకు సైతం ఇదే ప్రధాన రహదారిగా ఉంది. దీంతో నిత్యం ట్రాఫిక్ జామ్కావడం, ప్రజలు అవస్థలకు గురికావడం పరిపాటిగా మారింది. ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు ఐదారు నెలల నుంచి ఇదే పరిస్థితిని ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. బైపాస్‌రోడ్డు ఏ టైంలో ఫ్రీగా ఉంటుందో, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
అంబులెన్స్‌లు సైతం అవతలకి పోయే పరిస్థితి లేకపోవడంతో బాధితులు ఆవేదనకు గురవుతున్నారు. ఇదిలాఉంటే నాయుడుపేట సర్కిల్ నుంచి కరుణగిరి వరకు ఏర్పడుతున్న రద్దీ కారణంగా ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. కనీసం మున్నేరు బ్రిడ్జి రహదారి విస్తరణ చేపట్టి ఆటోలు ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో అటు పోలీసులు, ఇటు వాహనదారుల కష్టాలు అంతాఇంతా కాదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని బైపాస్ రోడ్డుపై ప్రయాణం సులభతరం చేయాలని వాహనదారులు ముక్తకఠంతో కోరుతున్నారు.