ఖమ్మం, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో సెలవుపై వెళితే.. మరో అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కానీ, దీనిపై ఉన్నతాధికారులు ఇప్పటికి మౌనవ్రతమే పాటించడంతో అంతా అస్తవ్యస్తంగా మారింది. డీఈవో ఈ నెల 17వ తేదీ నుంచి సెలవులో ఉండగా.. వారం గడుస్తున్నా ఇన్చార్జి డీఈవో నియామకం విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. విద్యాసంవత్సరం జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించిన ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల స్థానంలో సర్దుబాట్లు, పాఠశాలల సంసిద్ధత వంటి అత్యంత కీలక ప్రక్రియలు పూర్తి చేయాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇన్చార్జి డీఈవో లేకపోవడంతో వాటి బాధ్యతను ఎవరు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఉపాధ్యాయుల వేతన బిల్లులు ఎలా..?
డీఈవో సెలవుపై వెళ్లడంతో అనేక కీలక ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బందికి సంబంధించిన సర్వీస్ రిజిస్టర్లతోపాటు ఖమ్మం డిప్యూటీ డీఈవో, మధిర డిప్యూటీ డీఈవో కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వేతనాలు మంజూరు చేయాలంటే డీఈవోనే డిప్యూటీ డీఈవోగా కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. అలాగే డీఈవోనే డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. డీఈవో సెలవులో ఉండటంతో డైట్‌కి సైతం ఎవరినీ ఇన్చార్జిగా నియమించలేదు. దీంతో అక్కడి సిబ్బంది వేతనాలు సైతం ఆగిపోనున్నాయి. సోమ, మంగళవారం నాటికి ఉన్నతాధికారులు స్పందించి ఇన్చార్జి బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలి. లేదంటే ఈ నెల తమ వేతనాలు రానట్లేనని ఈ శాఖల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
సర్దుబాటుకి సమస్యలు..
జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో మే, జూన్, జూలై నెలల్లో ఉద్యోగ విరమణ పొందే వారి స్థానాల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలంటే కసరత్తు చేయడానికి, మండలాల నుంచి ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయుల వివరాలు సేకరించడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది. సంబంధిత ఎంఈవోల నుంచి వివరాల సేకరణకు, సర్దుబాటు ప్రక్రియకు డీఈవో అనుమతి ఉండాలి. అయితే ఇన్చార్జి డీఈవోగా ఎవరినీ నియమించకపోవడంతో ఈ ప్రక్రియ కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఆలస్యమైతే విద్యార్థుల బోధనపై ప్రభావం పడే ప్రమాదం ఉందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మిగిలిన పోస్టుల్లోనూ ఇన్‌చార్జిలే..
కరీంనగర్ జిల్లా డీఈవోను ఖమ్మం జిల్లాకు అదనపు బాధ్యతలతో డీఈవోగా నియమించారు. ఏడీగా పనిచేస్తున్న రాజేశ్వర్ సైతం సెలవుపై వెళ్లడంతో సూపరింటెండెంట్ చావా శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎఫ్ఏవో(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్) విప్లవ్‌కుమార్ సైతం సెలవు పెట్టడంతో అతడి స్థానంలో జలగంనగర్ పాఠశాల హెచ్ఎం శ్యాంసన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్లానింగ్ కో ఆర్డినేటర్‌గా మధిర పాఠశాలలో హెచ్ఎంగా పని చేస్తున్న సీహెచ్.రామకృష్ణ ఆన్ డ్యూటీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏఎంవోగా తిరుమలాయపాలెం మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న పి.ప్రభాకర్‌రెడ్డి ఆన్ డ్యూటీపై పనిచేస్తున్నారు. ఇలా జిల్లా విద్యాశాఖలోని అన్ని కీలక విభాగాలను ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.