హనుమకొండ, మే 3: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డికి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. నల్లగొండ కలెక్టర్ ఈ నెల 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా అదే రోజు నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అధికారులు వెల్లడించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళా ఓటర్లు 1,74,794 మంది, పురుషులు 2,87,007 మంది, ట్రాన్స్జెండర్లు ఐదుగురు ఉన్నారు.