అశ్వారావుపేట, అక్టోబర్ 13: దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకున్న అన్నదాతలను అనేక ఇక్కట్లకు గురిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్య, ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్న కొడుకులు, బిడ్డలు, అల్లుళ్లు విజయదశమికి ఇంటికొస్తే.. తీరా అదే రోజున సమావేశమంటూ అన్నదాతలను పిలుచుకెళ్లిన ప్రభుత్వం.. వారికి ఆనందం లేకుండా చేసింది. ఆపై ఆకలితో అలమటింపజేసింది. దీంతో విసుగుచెందిన కర్షకులు.. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రసంగిస్తుండగానే ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలకే ప్రసంగాలు వినిపించుకోవాల్సిన దుస్థితి ఉమ్మడి ఖమ్మం మంత్రులకు ఏర్పడింది.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఆయిల్‌పాం ఫ్యాక్టరీలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజయదశమి రోజైన శనివారం ప్రారంభించారు. ఆయిల్‌పాం సాగుపై అవగాహన సదస్సు పేరిట ఈ కార్యక్రమం కోసం భద్రాద్రి, ఖమ్మం జిల్లాల రైతులను అధికారులు తరలించారు. ఉదయం 10 గంటలకే మంత్రులు సదస్సును ప్రారంభిస్తారంటూ చెప్పిన అధికారులు.. అంతకు కొన్ని గంటల ముందే రైతులను సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు.
కానీ మధ్యాహ్నం వరకూ సభ ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలకు గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు. మధ్యాహ్నం 12:08 గంటలకు మంత్రి తుమ్మల, 12:53 గంటలకు మరో మంత్రి పొంగులేటి, 2:14 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి హజరయ్యారు. అప్పటికే అసహనం, ఆకలితో ఉన్న అన్నదాతలకు ఆ సమయంలో భోజనమూ అందించలేదు. దీంతో ఆకలితో అలమటిస్తున్న రైతులు ఒక్కసారిగా భోజనాల కోసం టెంట్ల వైపు వెళ్లారు. కానీ భోజనాలు వడ్డించేందుకు ఇంకా అనుమతి రాలేదని, పర్మిషన్ వస్తేనే భోజనాలు వడ్డిస్తామని క్యాటరింగ్ సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో రైతులు మండిపడ్డారు.
‘మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనాల కోసం పడిగాపులు కాయాలా? వేళకు భోజనం చేయకుంటే బీపీ, షుగర్ ఉన్న రైతుల పరిస్థితి ఏంటి?’ అంటూ భోజన పేట్లను విసిరేశారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా రైతులు పట్టించుకోలేదు. ‘పండుగ రోజు ఏంటి మాకు ఈ పరీక్ష? గత్యంతరం లేక ఈ సమావేశానికి వచ్చామా? పండుగ రోజున కుటుంబాలతో ఉండనీయకుండా, సమావేశం పేరిట భోజనాలు కూడా అందించకుండా ఎందుకు పిలిచారు?’ అంటూ ఆక్రోశం వెలిబుచ్చారు.
దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన మంత్రులు, ఎమ్మెల్యే.. ‘భోజనాల తర్వాత సమావేశం కొనసాగిద్దాం’ అంటూ ప్రకటించారు. అప్పటికే చాలామంది రైతులు ఇంటి బాట పట్టారు. భోజనాల తరువాత మిగతా రైతులూ బయటకు వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణమంతా ఖాళీ అయింది. ఇంతలో వర్షం కూడా ఊపందుకోవడంతో రైతులు, అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే రైతులు లేక సభ వెలవెలబోయినప్పటికీ ఖాళీ కుర్చీలకే మంత్రులు ప్రసంగాలు వినిపించి సభను ముగించారు.
సహజ వనరులను వినియోగిస్తూ రాబోయే ఆరేళ్లలో 20 వేల మెగా వాల్ట్స్ హరిత విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకోసం న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తామని చెప్పారు. స్థానిక ఆయిల్‌పాం ఫ్యాక్టరీలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రూ.2 లక్షలపైన ఉన్న రైతులకు కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామని అన్నారు.
ఆయిల్‌పాం రైతులకు టన్ను గెలలకు కనీస మద్దతు ధర రూ.20 వేలు అందిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్‌పాం సాగుకు పుట్టినిల్లు అశ్వారావుపేట నియోజకవర్గమేనన్నారు. గిట్టుబాటు ధర కోసం పక్క రాష్ర్టాలైన ఏపీ, కర్ణాటకలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అవసరమయ్యే పోరాటానికి రైతులకు కూడా సహకరించాలని కోరారు.
రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగుకే మంచి భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయిల్‌పాం సాగులో దేశంలోకెల్లా తెలంగాణే మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అడవుల పునరుద్ధరణకు ఆయిల్‌పాం సాగు దోహదపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, ఎండీ యాస్మిన్ బాషా, రాష్ట్ర ఉన్నతాధికారి రఘునందన్‌రావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఇతర అధికారులు సరోజనీదేవి, ఎంవీ మదుసూధన్, బాబూరావు, బీఎన్ రావు, రాజశేఖర్, హేమంత్‌కుమార్, ఆయిల్‌పాం రైతు సంఘం నేతలు ఆలపాటి రామచంద్రప్రసాద్, వీర రాఘవరావు, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.