కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 4: ‘మా పొట్టకొట్టే కార్పొరేషన్ మాకొద్దు’ అంటూ సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీల పరిధిలో గల ఉపాధి హామీ కూలీలు కార్పొరేషన్ విలీన వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏడు గ్రామ పంచాయతీలు సుజాతనగర్, నాయకులగూడెం, లక్ష్మీదేవిపల్లి, కోమటిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట, నర్సింగ్ సాగర్ పంచాయతీల నుంచి తరలివచ్చిన ఉపాధిహామీ కూలీలు ‘మా పొట్టకొట్టొద్దు.. మా జీవితాలను ఆగం చేయొద్దు’ అంటూ పెద్దపెట్టున నినదించారు.
ఈ సందర్భంగా కాట్రాల తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో పోరాట కన్వీనర్ కున్సోత్ ధర్మ మాట్లాడుతూ ఏడు పంచాయతీల పరిధిలో సుమారు 5 వేల మంది ఉపాధిహామీ కూలీలు ఉన్నారని, వీరంతా వంద రోజుల పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఆయా గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తే వీరికి ఉపాధిహామీ పనులు ఉండవని, ప్రభుత్వం వెంటనే కార్పొరేషన్ ఆలోచనను విరమించుకోవాలని, లేదంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.