అశ్వారావుపేట, ఫిబ్రవరి 1 : మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ ప్రభావం ఉపాధిహామీ కూలీలపై పడింది. ప్రభుత్వ పథకాలకు వారిని దూరం చేసింది. పనుల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీలో పేరాయిగూడెం, గుర్రాల చెరువు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం మున్సిపాలిటీ హోదా కల్పించింది. దీంతో ఈ నెల 25వ తేదీ నుంచి పాలన అమలులోకి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉపాధిహామీ కూలీలకు సమస్య అక్కడే మొదలైంది. అశ్వారావుపేట మున్సిపాలిటీ అర్బన్ పరిధిలోకి వెళ్లడంతో ఉపాధిహామీ పథకం నిలిచిపోనున్నది. దీంతో కూలీల కుటుంబాలు ఉపాధిహామీ పనులకు దూరమవుతున్నారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడి ఉపాధిహామీ కూలీలు మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యిందని సంతోషపడాలో.. పనులు లేక పస్తులుండాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.
ఉపాధి కోల్పోతున్న 1,125 కుటుంబాలు
అశ్వారావుపేటకు మున్సిపాలిటీ హోదా కల్పించడంతో 1,125 మంది కూలీలు ఉపాధిహామీ పథకానికి దూరం కాబోతున్నారు. అశ్వారావుపేట(పాత గ్రామపంచాయతీ) పరిధిలో 2,841 జాబ్ కార్డులు జారీ కాగా.. 5,112 మంది కూలీలు లబ్ధి పొందుతున్నారు. వీటిలో 575 యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా.. 543 మంది కూలీలు ఉపాధి పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాగే పేరాయిగూడెం(పాత గ్రామపంచాయతీ) పరిధిలో 607 జాబ్ కార్డులకు.. 1,132 మంది కూలీలు ఉన్నారు. వీటిలో 318 యాక్టివ్ జాబ్ కార్డుల్లో 457 మంది, గుర్రాల చెరువు (పాత గ్రామపంచాయతీ) పరిధిలో 293 జాబ్ కార్డులకు.. 556 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 91 యాక్టివ్ జాబ్ కార్డుల ద్వారా 125 మంది రోజూవారీగా ఉపాధి పనులు చేసుకుంటున్నారు. మొత్తం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో 3,741 జాబ్ కార్డుల్లో 6,800 మంది కూలీలు ఉన్నారు. 884 యాక్టివ్ జాబ్ కార్డుల్లో 1,125 ఉపాధి పనులపై ఆధారపడిన కూలీలు పథకానికి దూరమవుతున్నారు. వీరిలో 57.06 శాతం మంది ఎస్సీలు, 1.28 శాతం మంది ఎస్టీలు ఉపాధి కోల్పోతున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఎంపికైన 264 మంది ఉపాధి కూలీలు సైతం పథకం ప్రయోజనానికి దూరమవుతున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రద్దు..
మున్సిపాలిటీ హోదా ఎఫెక్ట్‌తో 264 మంది కూలీలు ఆత్మీయ భరోసా ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. ఇటీవల గ్రామాల వారీగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం అధికారులు అర్హులైన వారిని ఎంపిక చేశారు. పథకం కింద ఏటా ఒక్కో లబ్ధిదారుడికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నది. రెండు దఫాలుగా రూ.6 వేల చొప్పున ఏడాదిలో రెండుసార్లు రూ.12 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నది. ఈ పథకానికి భూమి లేని ఉపాధి కూలీలను అర్హులుగా ఎంపిక చేసింది. దీని ప్రకారం అశ్వారావుపేట పరిధిలో 108 మంది, పేరాయిగూడెం పరిధిలో 115 మంది, గుర్రాల చెరువు గ్రామపంచాయతీ పరిధిలో 41 మంది.. మొత్తం 264 మంది ఆత్మీయ భరోసా పథకానికి ఎంపికయ్యారు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత పథకం రద్దు కావడంతో అర్హులైన వారు లబోదిబోమంటున్నారు. మున్సిపాలిటీ పేరుతో ఆత్మీయ భరోసాను రద్దు చేయడం అన్యాయమని, తమకు కూడా వర్తింపజేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
ఆత్మీయ భరోసా రద్దు అన్యాయం..
మేజర్ గ్రామపంచాయతీని అప్‌గ్రేడ్ చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను రద్దు చేయడం అన్యాయం. మాకు ఇకపై ఉపాధి పనులు లేకుండా పోతాయి. ఉపాధి పనులు చేసుకుంటూ జీవిస్తున్న కూలీలు ఆర్థికంగా నష్టపోతారు. మళ్లీ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉపాధి పనులతోపాటు ఆత్మీయ భరోసా పథకాన్ని కూలీలకు వర్తింపజేయాలి.
-ఊడా సరస్వతి, మహిళా కూలీ, అశ్వారావుపేట
ఉపాధి పథకం ఇక ఉండదు..
ఉపాధిహామీ పథకం ఇకపై మున్సిపాలిటీ పరిధిలోని అశ్వారావుపేట, గుర్రాల చెరువు, పేరాయిగూడెం గ్రామాల్లో ఉండదు. అర్బన్ హోదా వల్ల ఈ పథకం నిలిచిపోతుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పథకాన్ని నిలిపివేయక తప్పదు. అలాగే ఇప్పటికే ఎంపికైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు కూడా పథకం రద్దు అవుతుంది.
-ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో, అశ్వారావుపేట