పాల్వంచ/ మణుగూరు టౌన్, జూలై 10: వైటీపీఎస్లోని యాష్, కోల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ టెండర్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 16వ రోజుకు చేరాయి. పాల్వంచలోని కేటీపీఎస్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. మణుగూరు బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యుత్ యాజమాన్యాల మొండి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఆయా కార్యక్రమాల్లో జాక్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు, రైతులకు నిరంతరాయ సేవలు అందించాలంటే ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కానీ, అలాంటి సంస్థలను ప్రైవేటుపరం చేయాలని చూడడం సరికాదన్నారు. ప్లాంట్ల ప్రైవేటీకరణ టెండర్లను వెంటనే రద్దు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాల్వంచలో నిరసనలకు ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు జలీల్, పాల్వంచ 33వ డివిజన్ కార్పొరేటర్ బాలునాయక్కు సంఘీభావం తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో రాజేందర్, యాస్మిన్, ఉమామహేశ్వరరావు, బ్రహ్మాజీ, మహేశ్, రఘువీర్, రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, తిరుపతి, సయ్యద్, సీతారామిరెడ్డి, కళాధర్, సంపత్, పావని, లక్ష్మి, రజిత, లావణ్య, శ్రీనివాసరెడ్డి, రవిప్రసాద్, నరేశ్, మహేశ్, ప్రసాద్, వెంకట్రాం, కృష్ణ, శోభన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.