నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 17 : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ(తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆయా తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద భోజన విరామ సమయాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా జూన్ 2వ తేదీ నాటికి కొత్త పీఆర్సీని 51 శాతం ఫిట్మెంట్తో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రిటైర్డు ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన, దాచుకున్న డబ్బులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టకు 66 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. కొన్నిచోట్ల ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తాత్సారం చేయకుండా స్పందించాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

టేకులపల్లి: తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న టీజీఈ జేఏసీ నాయకులు

బూర్గంపహాడ్: తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న టీజీఈ జేఏసీ నాయకులు

రఘునాథపాలెం: తహసీల్ ఆఫీస్ ఎదుట నిరసన చేస్తున్న ఉపాధ్యాయ జేఏసీ నేతలు

దుమ్ముగూడెం: మారాయిగూడెం పాఠశాలలో నిరసన తెలుపుతున్న టీచర్లు

కొత్తగూడెం గణేశ్‌టెంపుల్: కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు

మధిర: తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగులు

సత్తుపల్లిటౌన్ : తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగ నాయకులు

చండ్రుగొండ తహసీల్దార్ కార్యాలయం ఆందోళన చేస్తున్న ఉద్యోగులు