ఖమ్మం, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘పల్లెల ప్రగతే దేశానికి పట్టుకొమ్మ’ అన్నారు పెద్దలు. కానీ అవే పల్లెలకు నేడు కష్టాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించారు. పంచాయతీల పాలనను బలోపేతం చేయడంతోపాటు వాటిని ప్రగతిపథంలో ముందుకు నడిపించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పల్లెసీమల్లో అభివృద్ధి పరుగులు పెట్టింది. కానీ ఐదు నెలల క్రితం కాంగ్రెస్ పాలన వచ్చిందోలేదో పల్లెలకు కష్టాలు తోడయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పల్లెల అభివృద్ధిని పట్టించుకునే వారే కరువయ్యారు. ఫలితంగా అప్పటి వరకూ కాంతులీనిన పల్లె సీమలను కారుచీకట్లు చుట్టుముట్టాయి. పాలన అంతా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా ఉంది.
నాడు నిరంతర పరిశ్రమ.. 
గ్రామాల అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పరిశ్రమించారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిత్యం కొనసాగాయి. నిధులు ప్రతి నెలా మంజూరయ్యేవి. దీంతో వీధిలైట్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, తాగునీరు, సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేది. మల్టీపర్పస్ వర్కర్లను నియమించి గ్రామాల్లో పరిశుభ్రతకు పాటుపడ్డారు. ప్రతి గ్రామ పంచాయతీకీ ఒక ట్రాక్టర్, ట్రాలీ, నీటి ట్యాంకర్‌ను అందించారు. ఆ ట్రాక్టర్‌తో గ్రామంలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేవారు. ట్యాంకర్ ద్వారా హరితహారం మొక్కలకు, నర్సరీల్లోని మొక్కలను నీటిని అందించేవారు. దోమలను పారదోలేందుకు ప్రతి గ్రామంలోనూ ఫాగింగ్ మెషీన్లను అందించారు.
నేడు తిరోగమనం..
కాంగ్రెస్ పాలన వచ్చిన నాటి నుంచి పల్లె సీమలన్నీ తిరోగమనంవైపు పయనిస్తున్నాయి. అభివృద్ధి జాడలు మచ్చుకైనా కన్పించడంలేదు. పారిశుధ్యం పూర్తిగా అటకెక్కింది. గాలిదుమారాలకు దెబ్బతిన్న వీధిలైట్లు, ఎల్ఈడీ బల్బుల స్థానంలో కొత్తవి అమర్చేందుకు కూడా కనీసం నిధులు లేవు. పంచాయతీల్లోని కంప్యూటర్ ఆపరేటర్లకు 3 నెలలుగా వేతనాలు లేవు. మల్టీపర్పస్, పారిశుధ్య వర్కర్లదీ అదే పరిస్థితి. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలున్నాయి. అన్ని పంచాయతీలు ట్రాక్టర్లు కొనుగోలు చేసినప్పటికీ వాటిలో 140 ట్రాక్టర్లను ఈఎంఐ ద్వారా కొనుగోలు చేశారు. వాటికి ప్రస్తుతం నిధుల కొరత ఏర్పడడంతో రెండు నెలలుగా ఈఎంఐలు చెల్లించే పరిస్థితులు లేవు. పంచాయతీల్లో ఉన్న తాగునీటి బోర్లు, వీధి దీపాల విద్యుత్‌కు బిల్లుల చెల్లింపులకు మూడు నెలలుగా కటకటలాడుతున్న పరిస్థితి. చివరికి ట్రాక్టర్ల డీజిల్ కోసం కూడా దిక్కులు చూడాల్సిన దుస్థితి. కాంగ్రెస్ పాలనలో పల్లెల దయనీయ స్థితికి ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు.
నాలుగైదు గ్రామాలకు ఒక ప్రత్యేకాధికారి..
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నాలుగు నెలలుగా అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. గ్రామాలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినప్పటికీ.. ఒక్కో అధికారి సగటున నాలుగైదు గ్రామాల బాధ్యతలను పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో వారు ఆయా పంచాయతీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం లేకపోయింది. దీంతో ప్రత్యేకాధికారుల పాలనా విధానం విఫలమైంది. కానీ గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీల పాలనను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అన్ని గ్రామ పంచాయతీలకూ గ్రామ కార్యదర్శులను నియమించింది. ప్రస్తుతం వారు విధుల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి. రానున్న వానకాలంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఇందుకోసం పల్లెల్లో నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ తీరుతో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
‘భద్రాద్రి’ పల్లెల్లోనూ నీరసం
భద్రాద్రి జిల్లాలో కేసీఆర్ సర్కారులో ఒక వెలుగు వెలిగిన పల్లెలు.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో నిధులులేక నీరసించాయి. డీజిల్ లేకపోవడంతో పంచాయతీల ట్రాక్టర్లు నడవలేకపోతున్నాయి. తప్పనిసరి అయితేనే కార్యదర్శులు డీజిల్ పోయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో నాలుగు నెలలుగా సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలుండగా వాటిల్లో మేజర్ పంచాయతీలు మాత్రమే ఇంటిపన్నుల ఆదాయాన్ని కొంతమేరకు అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నాయి. చిన్న పంచాయతీల కార్యదర్శులు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి.
బిల్లులు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే..
గ్రామ పంచాయతీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. రెండు నెలలుగా పారిశుధ్య కార్మికులకు, మూడు నెలలుగా 70 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు అందడం లేదు. కరెంట్ బిల్లుల చెల్లింపులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. నిధులు విడుదలైన వెంటనే బకాయిలు చెల్లిస్తాం. నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం.
-హరికిషన్, డీపీవో, ఖమ్మం
చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరిస్తున్నాం..
పంచాయతీల్లో కార్మికులకు వేతనాలు ఇస్తున్నాం. నిధులు రావడం.. రాకపోవడం అనేది సమస్య కాదు. రాంపురంలో ట్రాక్టర్ మూలనపడిన విషయం నా దృష్టికి రాలేదు. డీజిల్ సమస్య కారణంగా ట్రాక్టర్లు తిరగడం లేదనే ఇబ్బందులు ఎక్కడా లేవు. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరిస్తున్నాం.
-చంద్రమౌళి, డీపీవో, భద్రాద్రి కొత్తగూడెం