కొత్తగూడెం సింగరేణి, మే 30 : తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవ వేడుకలను కోల్‌బెల్డ్ ఏరియాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వేదికగా నిర్వహించనున్న ప్రధాన వేడుకల్లో సీఎండీ బలరాం ముఖ్యఅతిథిగా పాల్గొంటారని డైరెక్టర్(పా, పీపీ) వెంకటేశ్వర్లు వెల్లడించారు. కొత్తగూడెంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవతరణ దినోత్సవ వేడుకల వాల్ పోస్టర్‌ను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రకాశం స్టేడియం, బస్టాండ్ సెంటర్ మీదుగా అమరవీరుల స్థూపం వరకు తెలంగాణ రన్ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9:15 గంటలకు సీఎండీ జెండా ఆవిష్కరణ చేస్తారని, తర్వాత ఎస్అండ్పీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ సమర్పించే గౌరవ వందనం స్వీకరించి సందేశం ఇస్తారన్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి ప్రకాశం స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, సింగరేణీయులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జీఎంలు కవితానాయుడు, కిరణ్‌కుమార్, ఏజీఎం రాజేంద్రప్రసాద్, డీజీఎం ముకుంద సత్యనారాయణ, డీవైపీఎం జీకే కిరణ్‌కుమార్, సీనియర్ పీవో శ్రీనివాసరావు, ఉదయ్‌కుమార్, వరప్రసాద్‌రావు, ఎంసీ పాస్నెట్, ఇజాజ్ షరీఫ్ పాల్గొన్నారు.