– ఏడాదిలోనే ఆరు రెట్లు పెంపుతో అంచనా బడ్జెట్
– బడ్జెట్ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్ష కౌన్సిలర్లు
– మున్సిపల్ చైర్ పర్సన్ పి.అనిత అధ్యక్షతన ఏదులారాపురం పాలకవర్గ సమావేశం
ఖమ్మం రూరల్, మార్చి 28 : 2026-27 సంవత్సరానికి గాను ఏదులాపురం మున్సిపాలిటీ కౌన్సిల్ అంచనా బడ్జెట్ రూ.72.34 కోట్లుగా ప్రకటించడం జరిగింది. శనివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత అధ్యక్షతన జరిగింది. 2026- 27 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ను అందుకు సంబంధించి ఖర్చుల వివరాలను తెలుపుతూ మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ బడ్జెట్ ప్రతిపాదనలో పాలకవర్గం ముందుంచారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను పాలకవర్గ సభ్యులకు అందజేశారు. సాధారణంగా ఏ పాలకవర్గ బడ్జెట్ అయినప్పటికీ ప్రస్తుత బడ్జెట్ కు వచ్చే ఏడాది బడ్జెట్ కు కొంత శాతం అంచనాలను పెంచుతూ అంచనా బడ్జెట్ నివేదికను తయారు చేయడం జరుగుతుంది. 2025- 26 సంవత్సరానికి సంబంధించి ఇదే మున్సిపాలిటీ బడ్జెట్ రూ 9.71 కోట్లుగా ఉంది. పూర్తి నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.9.19 కోట్లు. వివిధ అభివృద్ధి పనులు ఉద్యోగుల జీతభత్యాలకు ఇతర అవసరాలకు ఖర్చులు పోగా రూ.51.28 లక్షలు మాత్రమే మిగిలి ఉంది.
అయితే వచ్చే ఏడాది నాటికి మున్సిపాలిటీ బడ్జెట్ రూ.72.34 కోట్లుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్ కు సంబంధించి పలు ప్రతిపాదనలు సైతం బడ్జెట్ నివేదికలో పొందుపరచడం జరిగింది. తొలి ఏడాది బడ్జెట్ రూ.9 కోట్లు కాగా మరుసటి ఏడాది రూ.72 కోట్లు ఎలా సాధ్యమని విపక్ష సభ్యులు తమ అనుమానాలను, సందేహాలను కౌన్సిల్ సమావేశంలో వ్యక్తపరిచారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో ఇంచుమించు రూ.15 కోట్ల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సైతం జరిగాయని పనులు కూడా ప్రారంభం కాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవిక బడ్జెట్ రూపకల్పన చేయకుండా ఆశల పల్లకిలో ఉంచి అంకెల గారడీగా అంచనా బడ్జెట్ను వేయడం సరికాదని కౌన్సిల్ సమావేశంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయితే వాస్తవంగా రూ.9 కోట్ల బడ్జెట్ రెవెన్యూ ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధుల ఆధారంగా అంచనా బడ్జెట్ ను తయారు చేయడం జరిగిందని కౌన్సిల్ సభ్యులకు సంబంధిత అధికారులు చెప్పడం కోసం మెరుపు.
ప్రస్తుతం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయని, వచ్చే ఏడాది నాటికి రూ.72 కోట్ల నిధులు వెచ్చిస్తే యావత్ మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా తయారవుతుందని కౌన్సిల్ సభ్యులు, అధికారులు చైర్పర్సన్ ముందు తమ కోరికను వెలుబుచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో తమ వార్డులలో మిషన్ భగీరథ పైపు లీకేజీలు వస్తేనే సరి చేయలేని దుస్థితి నెలకొందని, ఇలాంటి సమయంలో ఇన్ని కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఆశలు రేకెత్తించడం సరికాదని వారు తెలిపినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో అంచనా బడ్జెట్ నిజమైతే ఇంతకంటే సంతోషం ఇంకేం ఉంటుందని పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశం అనంతరం చర్చించుకున్న సందర్భం నెలకొంది. ఈ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, పలువురు మున్సిపల్ అధికారులు, ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.