భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్, సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వేశ్వర్‌రెడ్డి ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్యతో కలిసి జిల్లా ఎన్నికల నోడల్ ఆఫీసర్లు, ఏవోలు, ఏఈవోలతో సోమవారం సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతా చర్యలు, పోలింగ్‌కు సంబంధించిన అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నోడల్ అధికారులు, పోలీస్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లను క్రమనుగుణంగా పరిశీలించాలని ఆదేశించారు. పోలింగ్, ముందు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, మద్యం నియంత్రణ, పోలింగ్ నిర్వహణపై వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై కూడా ఆయన పలు సూచనలు చేశారు. సమావేశంలో సీపీవో సంజీవరావు, ఇన్చార్జి డీపీవో సుధీర్, పౌర సరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్‌బాబు, అడిషనల్ డీఆర్డీవో రవి, ఏవోలు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
Sarveshwar Reddy