కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల నగారా మోగించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ అమలులోకి రావడంతో వెనువెంటనే ఉమ్మడి జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను రెండు జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 11,96,293, భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 9,45,094 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం) ద్వారా ఓటు హక్కు వినియోగంపై క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ అందరికన్నా ముందుగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. నాయకులు ఇంటింటికీ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు.
ఖమ్మం, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా జిల్లాల అధికారులు సర్వం సమాయత్తమయ్యారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించడంతో ఇటు రాజకీయ పక్షాలు, అటు అధికార యంత్రాంగం ఎన్నికలపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఈ నెల 4న ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 11,96,293 మంది ఓటర్లు నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 9,45,094 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,439 పోలింగ్ కేంద్రాలను, భద్రాద్రి జిల్లాలో 1,095 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా 3,15,726 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా వైరా నియోజకవర్గంలో 1,90,755 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఐదు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం విశేషం. అలాగే భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచే ఎన్నికల నియమావళి (ఎన్నికల కోడ్) అమల్లోకి వచ్చింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది గంటల ముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాగా, ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే పలుమార్లు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఇప్పటికే అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో అధికారులు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన గంట వ్యవధిలో బోర్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
ఎన్నికలపై దృష్టి సారించిన రాజకీయ పార్టీలు..
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఆయా రాజకీయ పక్షాలు ఎన్నికలపై దృష్టి సారించాయి. అందరికన్నా ముందుగా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పోలింగ్ తేదీకి సరిగ్గా 50 రోజుల సమయం ఉండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం మరో 50 రోజుల ముందే అంటే ఆగస్టు 21నే పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 10 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం నియోజకవర్గంలో గడిచిన 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా ప్రజలతో మమేకమవుతూ సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ వర్గాల ప్రజలు మంత్రి పువ్వాడను ఆహ్వానించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. మరోవైపు రూ.వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, పాలేరు అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజు, వైరా బానోతు మదన్‌లాల్, ఇల్లెందు అభ్యర్థి హరిప్రియానాయక్, పినపాక అభ్యర్థి రేగా కాంతారావు, అశ్వారావుపేట అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు, కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అయితే బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి 50 రోజులు గడుస్తున్నా జిల్లాల్లో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌లో మాత్రం ఎన్నికల జోరు కనిపించడం లేదు. పార్టీలో ఎవరికి టికెట్ లభిస్తుందో, తాము ఎవరిని అభ్యర్థిగా మోయాల్సి వస్తుందో అనే ఆందోళన దశాబ్దాలుగా పార్టీ జెండాలు మోస్తున్న కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పనిచేసేవారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన వారికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉండడంతో ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావించిన ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో టికెట్ ఎవరికి లభిస్తుందో, ఎవరు రెబల్‌గా వ్యవహరిస్తారో తెలియని పరిస్థితి ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ఈవీఎంలపై అవగాహన..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం) ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో అనే అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం సీపీ విష్ణు, భద్రాద్రి ఎస్పీ వినీత్‌లు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై పోలీసులతో చర్చించారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు.
వైరా, తల్లాడలో రూ.5 లక్షల చొప్పున నగదు సీజ్
వైరాటౌన్/తల్లాడ/కొణిజర్ల, అక్టోబర్ 9 : కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే ఖమ్మం జిల్లా వైరా పోలీసులు రింగ్ రోడ్డు సెంటర్లో సోమవారం చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా.. ఒక కారులో రూ.5లక్షల నగదు లభించింది. ఏపీ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారును వైరా ఎస్సై మేడా ప్రసాద్ తనిఖీ చేయగా.. రూ.5 లక్షల నగదు లభించింది. దీంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, టీడీపీ నేత ఇమ్మాని రాజేశ్వరికి చెందినదిగా గుర్తించారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడం.. ఎలాంటి ఆధారాలు లేకుండా భారీ నగదుతో ప్రయాణించడాన్ని రోడ్ ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. కేవలం రూ.50 వేల వరకే నగదును తీసుకెళ్లే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు. అలాగే తల్లాడ మండల కేంద్రంలోని రింగ్ రోడ్డులో ఎస్సై సురేశ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి ఓ ద్విచక్రవాహనదారుడి వద్ద రూ.5 లక్షలు గుర్తించారు. వాహనదారుడు నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో ఎస్సై నగదును సీజ్‌చేశారు. అలాగే కొణిజర్ల పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఖమ్మం నుంచి కల్లూరు వైపు వెళ్తున్న కారులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.2.40 లక్షలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్సై శంకర్రాజు తెలిపారు.
నోటిఫికేషన్ వివరాలు ఇలా..
ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3 విడుదల
నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన నవంబర్ 13
పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితా నవంబర్ 15
ఎన్నికల తేదీ నవంబర్ 30
ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల డిసెంబర్ 3