కారేపల్లి, అగస్టు 20 : పర్యాటకంలో ఖమ్మం జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం వైరా కేంద్రంలోని రిజర్వాయర్ను ఆయన సందర్శించారు. రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప్రాంతం గుట్టలను, బోటింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటు గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆనకట్ట సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మత్స్య విత్తన క్షేత్రంను తనిఖీ చేశారు. మత్స్య శాఖ విత్తన కేంద్రంలో మౌలిక వసతులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప్రాంతాన్ని టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. బోటింగ్, కాటేజ్ గదులు, బిల్డింగ్ మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడం కోసం జిల్లాకు సంబంధించి మత్స్యకార సహకార సంఘాలు, వేల మంది సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా చెరువుల్లో చేప పిల్లలు వేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మత్స్య శాఖ ఏడీ శివప్రసాద్, జిల్లా టూరిజం శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, వైరా తాసీల్దార్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వేణు, అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
Karepalli : పర్యాటకంగా వైరా రిజర్వాయర్ అభివృద్ధికి కృషి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి