వైరా టౌన్, సెప్టెంబర్ 22: కస్తూర్బా విద్యాలయాల్లో చదువుకుంటున్న పిల్లలకు చిన్నతనం నుంచే విద్యతోపాటు మంచి విలువలు, క్రమశిక్షణ వంటివి నేర్పించాలని అదనపు కలెక్టర్ డీ.మధుసూదన్నాయక్ సూచించారు. ఏన్కూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని కిచెన్, డార్మెటరీ తదితర ప్రదేశాలను పరిశీలించారు. కిచెన్లో గరిటె తిప్పుతూ వంటల నాణ్యతను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థినులకు పాఠం బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులకు చిన్నతనం నుంచే నైతిక విలువలతో కూడిన కథలు కూడా నేర్పించాలని సూచించారు. అలాగే, టెన్త్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం మండలంలో పర్యటించిన ఆయన.. ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల దరఖాస్తుల పరిశీలనను పరిశీలించారు. ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు. ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.