రఘునాథపాలెం, జూలై 19 : ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై విద్యార్థి లోకం గళమెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. శనివారం ఖమ్మం నగరంలో జార్జిరెడ్డి పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులంతా కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అక్కడ అమరవీరుల స్థూపం వద్ద జార్జిరెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలోకి నెట్టివేయబడిందన్నారు. అధికారంలోకి వచ్చి 18నెలలైనా విద్యారంగంలో ఒక్క సమస్య కూడా పరిష్కారంకాలేదన్నారు. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు తమ పర్యటనల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు.
విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను మాత్రం విడుదల చేయడం లేదని మండిపడ్డారు. దుర్మార్గంగా విద్యార్థుల బస్పాస్ చార్జీలను సైతం పెంచారని ధ్వజమెత్తారు. ఖమ్మంజిల్లా నుంచి ముగ్గురు మంత్రుల ప్రాతినిధ్యం ఉండి కూడా జిల్లాకు ప్రభుత్వ జనరల్ యూనివర్శిటీ తీసుకరాలేకపోయారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి ఐక్య పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మందా సురేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమంత్ తదితరులు పాల్గొన్నారు.