అశ్వారావుపేట, మార్చి 2 : పది విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభు త్వం సంగ్రాహాణాత్మక ‘అభ్యాస దీపిక’లను రూపొందించింది. పాఠ్యాంశాల వారీగా భావనలు గుర్తించి వాటికి తగిన వివరణ ఇవ్వడం, ఇచ్చిన అంశాలపై వ్యాఖ్యానించడం, సమాచార విశ్లేషణ, సమకాలిన అంశాలపై ప్రతిస్పందించడం, ముఖ్యమైన పటాలను గీయడం, గొప్ప వ్యక్తులు, నినాదాలు, గుణాలు, వంటివి అభ్యాస దీపికలో పొందుపరిచారు. అభ్యాస దీపికను పూర్తిగా చదివిన ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయాలని తెలంగాణ సర్కార్ సూచించింది.
జిల్లాలో మొత్తం 124 జిల్లా, ప్రభుత్వ, కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4,436 మంది పదో తరగతి చదువుతున్నారు. వీరంతా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆరు పేపర్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి వెనుకబడినవారిని ప్రోత్సహించేలా నిపుణులతో అభ్యాస దీపికలను రూపొందించింది. గణిత, జీవ, రసాయన, భౌతిక, సాంఘికశాస్త్రం సజ్జెక్టుల్లోని ప్రధాన అంశాలను అందులో పొందుపరిచింది. వీటిని ఇంగ్లిష్, తెలుగు మీడియంలో ముద్రించింది.
ఉపాధ్యాయులకు సూచనలు..
విద్యార్థులకు సూచనలు ఇవీ..
ఉపాధ్యాయులతోపాటు అభ్యాస దీపికలు చదవడంలో విద్యార్థులకు సూచనలు చేసింది. పాఠం వారీగా ఇచ్చిన భావనలు, వివరణ బాగా చదివి అర్ధం చేసుకోవడం ద్వారా ప్రశ్న ఎలా అడిగినా సమాధానం చెప్పవచ్చు. అభ్యాస దీపికలో ఇచ్చిన అంశాల్లో ఎలాంటి అనుమానం వచ్చినా పాఠ్య పుస్తకం చూడటం, ఉపాధ్యాయుడిని అడిగి అనుమానం నివృత్తి చేసుకోవాలి. వీటిని బాగా చదవడం వల్ల పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు.
పది విద్యార్థులకు దీపికలు అందిస్తాం
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో అభ్యాస దీపికలను రూపొందించాం. వీటిని పదో తరగతి విద్యార్థులకు అందజేస్తాం. వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్టు నుంచి ఎటువంటి ప్రశ్నలు, బిట్స్ వస్తాయనే ప్రధాన అంశాలతో నిపుణులు వీటని రూపొందించారు. పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో అవగతమవుతున్నది.
– సోమశేఖర్శర్మ,జిల్లా విద్యాశాఖాధికారి, కొత్తగూడెం
ఉత్తీర్ణతకు దోహదం
విద్యార్థులు ఎక్కువ ఉత్తీర్ణత సాధించేందుకు అభ్యాస దీపికలు దోహదపడతాయి. విద్యా ప్రమాణాల ఆధారంగానే ప్రభుత్వం దీపికలను రూపొందించింది. స్వీయ అభ్యాసన సులభంగా ఉంటుంది. అప్పటికీ విద్యార్థులకు అనుమానాలు ఉంటే ఉపాధ్యాయులు నివృత్తి చేస్తుంటారు. పరీక్షలంటే విద్యార్థులకు భయం ఉండదు.
– సత్తెనపల్లి పుల్లయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అచ్యుతాపురం