ఖమ్మం అర్బన్, మార్చి 29 : అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఉన్నతాధికారులు చెప్పిన మాటలు గాలికి వదిలేశారు.. విద్యార్థుల భవిష్యత్ తమ చేతుల్లో ఉందని అప్రమత్తంగా ఉండాలనే విజ్ఞత కూడా లేకుండా పదో తరగతి సమాధాన పత్రాల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అధికారులు. ఖమ్మంజిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనతో టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అసలు పదో తరగతి సమాధాన పత్రాలు పదిలమేనా? అని కంగారు పడుతున్నారు.
పదో తరగతి పరీక్షల్లో భాగంగా శుక్రవారం పదో తరగతి పరీక్షలు ముగిశాక సంబంధిత పరీక్ష కేంద్రం అధికారులు సమాధాన పత్రాలను పోస్టల్ అధికారులకు అందజేస్తారు. వాటిని పోస్టల్ సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకుని జిల్లా కేంద్రానికి చేర్చాలి. దీనిలో భాగంగా కారేపల్లి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రానికి సంబంధించిన సమాధాన పత్రాల తరలింపులో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. తపాలాశాఖ సమాధాన పత్రాలు తీసుకున్న అనంతరం తరలించే సమయంలో సమాధాన పత్రాలకు వేసిన ప్యాక్ చినిగిపోయి, బయటికి కనిపిస్తున్నా అలానే తరలించారు. శుక్రవారం ఘటన జరగ్గా శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోస్టల్కి సంబంధించిన బస్తా, ప్యాక్ చినిగిపోయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండానే అలాగే తరలించారు.
శనివారం ఉదయం పరీక్ష ముగిసిన అనంతరం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు విషయం తెలిసి వెంటనే విచారణకు ఆదేశించారు. డీఈవో సోమశేఖరశర్మ, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు రైలు నిలయంలోని ఆర్ఎంఎస్ పాయింట్‌కు వెళ్లి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రానికి చెందిన సమాధాన పత్రాలను పరిశీలించారు. పరిశీలనలో ప్యాకింగ్ చినిగిపోయిందని, సమాధాన పత్రాలు మాత్రం సురక్షితంగానే ఉన్నాయని కలెక్టర్‌కు నివేదించారు. అనంతరం డీఈవో సోమశేఖరశర్మ జరిగిన సంఘటన తాలూక అంశాన్ని విద్యాశాఖ డైరెక్టర్, జిల్లా పరిశీలకులుగా వచ్చిన అదనపు డైరెక్టర్‌కు రాతపూర్వకంగా తెలిపారు. దీనిపై డీఈవో స్పందిస్తూ భౌతిక, రసాయనశాస్త్ర పరీక్ష జవాబు పత్రాలు సురక్షితంగా ఉన్నాయని తపాలా శాఖాధికారి తెలిపినట్లు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సమాధాన పత్రాల తరలింపులో నిర్లక్ష్యం పట్ల మీడియాలో వార్తలు చూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విద్యాశాఖ అధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమయ్యారు. ఇతర జిల్లాల్లో పేపర్లు లీక్‌కావడం, మొదటిరోజే ఇతర సబ్జెక్ట్ ప్రశ్నాపత్రాలు తెరిచిన అంశాలు ఉండటం.. ఖమ్మంజిల్లాలో ఏమి జరగలేదు అనుకుంటున్న తరుణంలో ఈ సంఘటన అప్రమత్తుల్ని చేసింది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.