ఖమ్మం అర్బన్, అక్టోబర్ 25 : ఉన్నతమైన సమాజ నిర్మాణానికి రేపటి పౌరులను అందించాల్సిన అతి గురుతరమైన విద్యాశాఖ ఖమ్మంజిల్లాలో గాడి తప్పింది. ఫలితంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యాశాఖను నడిపించాల్సిన కీలకమైన జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు సైతం గత మూడేళ్లుగా భర్తీకి నోచుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖకు సంబంధంలేని వ్యక్తులు డీఈవో పోస్టులోకి రావడంతో విద్యాశాఖ ఎటుపోతుందో అర్థంకావడం లేదు. పంచాయతీరాజ్‌శాఖకు చెందిన ఒక అధికారిని డీఈవోగా నియమించారు. కొద్దిరోజులకే ఆమెను తొలగించి, జిల్లా అదనపు కలెక్టర్‌కు విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
జిల్లాలోని 21 మండలాల్లో ఇద్దరే రెగ్యులర్ ఎంఈవోలు కాగా, మిగిలిన 19మంది సీనియర్ హెచ్ఎంలనే ఎంఈవోలుగా నియమించారు. రెండు డిప్యూటీ డీఈవో పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి విద్యాప్రణాళిక, పాఠ్యాంశాల రూపకల్పన చాలా కీలకమైంది. వాటి అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేస్తూ సమగ్రశిక్ష పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా విద్యాశాఖ తీరుతెన్నులను పర్యవేక్షిస్తూ జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి వారధులుగా సమన్వయకర్తలు పనిచేస్తారు. అయితే ఖమ్మంజిల్లాలో వీరిని నిబంధనలకు విరుద్ధంగా నియమిస్తుండడం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
సమగ్రశిక్ష జిల్లాస్థాయి సమన్వయకర్తల నియామకం, తొలగింపు వంటి మార్పులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ ప్రక్రియ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అనుమతితో జరుగుతుంది. కానీ విచిత్రంగా ఖమ్మం జిల్లాలో ఈ ప్రక్రియను జిల్లా యంత్రాంగమే స్వయంగా నిర్వహించింది. ప్రభుత్వం నిర్వహించే రాత పరీక్షలో ఉత్తీర్ణులై ప్రథమస్థానంలో నిలిచిన వారిని ఫారిన్ సర్వీస్ మీద జిల్లాస్థాయి సమన్వయకర్తలుగా నియమిస్తారు. వీరు కనీసం ఐదు సంవత్సరాలపాటు ఆ పోస్టులో కొనసాగాల్సి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వారిని రాష్ట్ర విద్యాశాఖ మారుస్తుంది. అయితే ఖమ్మంజిల్లాలో మాత్రం సమన్వయకర్తలను వెంటవెంటనే మార్చుకుంటూ పోవడం గందరగోళానికి దారితీసింది.
ఏఎంవో నియామకంపై గందరగోళం : ఏఎంవో(అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్)గా వ్యవహరించిన రవికుమార్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఆ పోస్టు నుంచి వైదొలగడానికి రాష్ట్ర విద్యాశాఖ అనుమతిచ్చింది. దీంతో అప్పటి సీఎంవో రాజశేఖర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఆ పోస్టు కోసం వైరా మండలానికి చెందిన ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం చావా శ్రీనివాసరావు తనకు అవకాశం ఇప్పించాలని కోరారు. కానీ తుమ్మలపల్లి ఉన్నత పాఠశాల సహాయకుడు రాజశేఖర్‌కు ఏఎంవోగా ఓడీపై బాధ్యతలు ఇచ్చారు. ఆయన వారం తిరగకుండానే వెళ్లిపోయారు. మళ్లీ మరో ఉన్నత పాఠశాలకు చెందిన శైలేందర్‌ను నియమించారు. ఆయన కూడా కొద్దిరోజులకే తాను చేయలేనంటూ తప్పుకున్నారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో నిబంధనలకు విరుద్ధంగా చావా శ్రీనివాసరావుకు కాకుండా తిరుమలాయపాలెం ఉన్నత పాఠశాల సహాయకుడు ప్రభాకర్‌రెడ్డిని ఓడీ బేసిస్‌పై నియమించారు. రెగ్యులర్ డీఈవో ఉండి ఉంటే నిబంధనలు కచ్చితంగా పాటించేవారని చర్చించుకుంటున్నారు.
జిల్లా సమగ్రశిక్షలో ఫైనాన్స్ అండ్ ఆడిట్ ఆఫీసర్(ఎఫ్ఏవో) సెలవుపై వెళ్లారు. అతని స్థానంలో మరొకరిని రాష్ట్ర అధికారులు నియమించాల్సి ఉంది. అయినప్పటికీ జిల్లా సమగ్రశిక్షలో ఓడీ బేసిస్‌పై పనిచేస్తున్న ప్లానింగ్ కోఆర్డినేటర్‌కు ఎఫ్ఏవోగా గత నెల చివరివరకు బాధ్యతలు ఇచ్చారు. ఓడీ బేసిస్‌పై పనిచేస్తున్న వ్యక్తికి మరో కీలకమైన పోస్టుకు పూర్తి అదనపు బాధ్యతలు ఎలా ఇచ్చారనే విషయమై అయోమయం నెలకొంది. అంతేకాక నేటివరకు ఎఫ్ఏవో పోస్టు ఖాళీగా ఉండటం వల్ల సమగ్రశిక్ష ఉద్యోగులు, కార్యకలాపాలకు అవసరమైన ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతున్నాయి. జిల్లా సమగ్రశిక్షలో తాము తమ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నామని ప్రస్తుతం ఏఎంవో, సీఎంవో జిల్లా అధికారులకు విన్నవించుకోవడంతో వారికి సహాయకులను నియమించడానికి కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే ఒక మంత్రి సిఫారసుతో కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని గత సంవత్సర కాలంగా డిప్యూటేషన్‌పై డీఈవో కార్యాలయంలో నియమించారు. మరో ఉపాధ్యాయుడిని ఇదేవిధంగా డిప్యూటేషన్‌పై సహాయకుడిగా నియమించగా అతడు వ్యక్తిగత వివాదంలో చిక్కుకోవడంతో సస్పెండ్ అయ్యా డు. అనధికారికంగా మరికొందరు ఉపాధ్యాయులను సహాయకులుగా ఇప్పటికే వాడుకుంటున్నారు. అధికారికంగా టీచర్లను డిప్యూటేషన్‌పై సహాయకులుగా నియమించడానికి కసరత్తు జరుగుతోంది. గతంలో ఎటువంటి సహాయకులు లేకుండానే సమన్వయకర్తలు సమర్ధవంతంగా తమ బాధ్యతలను నిర్వహించారు. ఈ వైనం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయమై దృష్టి సారించి నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖను గాడిలో పెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.